'జయతో వారం క్రితం మాట్లాడా'
న్యూఢిల్లీ: భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడుకు అన్నివిధాలా సాయమందిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హామీయిచ్చారు. వర్షాల కారణంగా తలెత్తిన పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు వారం రోజుల క్రితం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో మాట్లాడినట్టు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జయలలితతో మాట్లాడారని గుర్తు చేశారు.
రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలతో తమిళనాడు వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ప్రధాన జాతీయ రహదారులు నీట మునిగాయి. రాజధాని చెన్నై పూర్తిగా జలమయం అయింది. ఎయిర్ పోర్టును మూసివేశారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. స్కూల్, కాలేజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. చెన్నై వాసులకు సాయం అందించేందుకు ట్విటర్ ఇండియా చెన్నై రెయిన్స్ హెల్ప్ హాష్ ట్యాగ్ ను ప్రవేశపెట్టింది.
కాగా, తమిళనాడు వర్షాలపై సీనియర్ మంత్రులతో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. వెంకయ్య నాయుడు, రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.