సాక్షి, చైన్నె: తమిళనాడులో బీజేపీ అధికారంలోకి రావడానికి ఒక్క చాన్స్ ఇవ్వాలని ప్రజలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ప్రదాని నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలన విజయోత్సవ సభ తాంబరంలో మంగళవారం రాత్రి జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అధ్యక్షతన జరిగిన సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరయ్యారు. ఆయన ప్రసంగిస్తూ తమిళనాడు అంటే తనకు ఎంతో ఇష్టం అని, తమిళంలో ప్రసంగించాలన్న ఆశ ఉన్నా భాషా సమస్యతో తన మాతృభాష హిందీలోనే మాట్లాడాల్సిన పరిస్థితి ఉందన్నారు.
సిద్ధులు, ఆళ్వార్‌లు, నయన్మార్లు జీవించిన ఈ గడ్డకు రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నట్టు పేర్కొన్నారు. తమిళనాడుకే పరిమితమై ఉన్న సెంగోల్ చరిత్రను ప్రపంచ దేశాలకు చాటిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. తమిళనాడులో అవినీతి రాజ్యమేళుతోందని ధ్వజమెత్తారు. తమిళనాడులో అధికారం లక్ష్యంగా బీజేపీకి ఒక్క చాన్స్ ఇవ్వాలని కోరారు.
అవినీతి రహిత పాలనను తమిళనాట బీజేపీ అందిస్తుందన్నారు. 2047 నాటికి ప్రపంచంలోనే ఆర్థికాభివృద్ధిలో భారత దేశం ముందంజలోకి వెళ్లడం ఖాయం అని పేర్కొన్నారు. మంత్రి సెంథిల్ బాలాజీ వ్యవహారంలో సీఎం స్టాలిన్ రెండు నాల్కల ధోరణి అనుసరిస్తున్నారని ధ్వజమెత్తారు. రష్యాని ఏలిన నియంత స్టాలిన్ పేరు కలిగిన నాయకుడు ఇక్కడ నియంత వలే వ్యవహరిస్తున్నాడని, ఆయన పాలనకు చరమ గీతం పాడాలని ప్రజలకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment