
ఆగని ఆత్మహత్యలు
- ఒక్కరోజే నలుగురు రైతుల బలవన్మరణం
- రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు ఇప్పటికీ
- కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి
- శనివారం వరకు బెళగావి, మండ్య, శివమొగ్గ,
- మళవళ్లి, జిల్లాల్లో నలుగురు రైతులు
- ఆత్మహత్యకు పాల్పడ్డారు.
బెంగళూరు(బనశంకరి) : బెళగావికి చెందిన రైతు బాబాసాహేబజమతి (42)కి 4 ఎకరాల పొలం ఉంది. సాగుకు పెట్టుబడుల నిమిత్తం ఎస్‌బీఐ బ్యాంకులో రూ.లక్ష 5 వేలు అప్పుతోపాటు ప్రైవేటు వ్యక్తులనుంచి కూడా అప్పులు చేశాడు. పంటనష్టం రావడంతో అప్పులు తీర్చేదారి కానరాక రైతు పొలంలోనే ఉరివేసుకుని మృతి చెందాడు. ఈఘటనపై రామదుర్గ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రెండు నెలల నుంచి బెళగావిలో 10 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
మండ్య జిల్లా నాగమంగల తాలూకా కల్లుదేవనహళ్లికి చెందిన రైతు కుమార్(33)కు ఒకటిన్నర ఎకరాపొలం ఉంది. దాన్ని సాగు చేయడానికి పెట్టుబడుల నిమిత్తం రూ.3 లక్షల వరకు అప్పుచేశాడు.
పంట నష్టం రావడంతో అప్పు తీరే దారి లేక తన పొలంలోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండ్య గ్రామాంతర పోలీస్‌స్టేషన్ పరిధిలోని రైతు లోకేశ్ (45) ఏడెకరాల భూమిలో చెరకు పంటవేశాడు. బోరు తవ్వడానికి, సాగుకు పెట్టుబడుల నిమిత్తం రూ.6 లక్షలు, బ్యాంకులో రూ.లక్ష 50 వేలు అప్పు చేశాడు. చెరకు పంట రావడం, బోరులో నీరు రాకపోవడంతో అప్పులు తీర్చే దారిలేక శనివారం విషం తాగి ఆత్మహత్మకు పాల్పడ్డాడు.
శివమొగ్గ జిల్లా కుంసి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రేజికొప్ప గ్రామానికి చెందిన రైతు నారాయణప్ప(55)కు సాగు కోసం బ్యాంకులో రూ.2 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.లక్ష అప్పులు చేశాడు. నారాయణప్ప మూడురోజుల క్రితమే అదృశ్యం అయ్యారు. శనివారం ఉదయం అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని శవంలా కనిపించాడు. దీనిని గమనించిన స్థానికులు తక్షణం కుంసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
మళవళ్లి జిల్లా త్యాజ్య గ్రామానికి చెందిన రైతు కెంపేగౌడ(45) తన పొలంలో రేష్మపంట, చెరకు పంట వేశాడు. అయితే పట్టుగూళ్ల ధర అకస్మాత్తుగా పడిపోవడంతో కంగారుపడిన ఇతను తీవ్ర మన స్థాపం చెంది శనివారం మధ్యాహ్నం తోట నుంచి ఇంటికి వెళ్లి వస్తానని ఇంట్లో వారికి తెలిపి, కాస్త దూరంలో తోట వద్దనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు.