నిడో హత్యపై పెల్లుబికిన నిరసన
Published Sat, Feb 1 2014 11:00 PM | Last Updated on Fri, Nov 9 2018 4:31 PM
సాక్షి, న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్ యువకుడు నిడో తనియను లజ్‌పత్‌నగర్‌లో దుకాణదారులు నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఘటనపై నగరంలోని ఈశాన్యవాసుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దుకాణదారులు, వారి మిత్రులు కొట్టిన దెబ్బలను తట్టుకోలేక నిడో మరణించాడని వాళ్లు ఆరోపించారు. ఈ ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం లజ్‌పత్‌నగర్‌లో నిడోపై దాడి జరిగిన దుకాణం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. దోషులపై తక్షణం కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు హాజరైన ఈశాన్యప్రాంత యువత.. తమకు న్యాయం చేయాలని, అన్యాయాన్ని అంతమొందించాలంటూ నినాదాలు చేశారు.
ఈశాన్య ప్రాంతవాసులపై ఇలాంటి దాడులు జరగడం ఇదే మొదటిసారి కాద ని, తమపై వివక్షకు చూపడం, గేలిచేయడం సాధారణమైపోయిందని ఆరోపించారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఇలాంటి ఘటనలు మున్ముందు జరగకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ఈశాన్య ప్రాంతవాసులు, ప్రజాప్రతినిధులు ప్రధాని మన్మోహన్ సింగ్, హోంమంత్రి షిండే, బీజేపీ నేత హర్షవర్ధన్‌ను కూడా కలిశారు. ఆయన నిడోపై జరిగిన దాడిని ఖండిస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని ఈశాన్యప్రాంతవాసుల భద్రతకు చర్యలు తీసుకోవలసిందిగా ప్రధాని, హోంమంత్రికి లేఖ రాస్తానని చెప్పారు. ఈ ఘటనపై హోంశాఖ ఢిల్లీ పోలీసుల నివేదిక కోరింది.
దుకాణం దగ్గర వదిలేయలేదు: పోలీసులు
ఇదిలా ఉండగా నిడో తనియను ఘర్షణ జరిగిన దుకాణం వద్దనే తిరిగి వదిలిపెట్టారన్న ఆరోపణలను పోలీసులు ఖండించారు. అయితే ఇది నిజం కాదని ఢిల్లీ పోలీసులుశనివారం స్పష్టం చేశారు. నిడోను అతని సోదరికి అప్పగించామని పోలీసులు తెలిపారు. నిడో అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే నిడో పవిత్ర కుమారుడు. జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఇతడు జనవరి 29న లజజ్‌పత్‌నగర్‌లోని మిత్రుని ఇంటికి బయలుదేరాడు. ఏ బ్లాక్‌లో నివసించే మిత్రుని ఇల్లు ఎక్కడుందో తెలుసుకోవడానికి అదే బ్లాకులోని ఓ మిఠాయి దుకాణంలో అడిగాడు. అందులో కూర్చున్న ఇద్దరు సోదరులు ఫర్మాన్, రిజ్వాన్ తన జుట్టును చూసి గేలి చేయడం నిడోకు కోపం తెప్పించింది. దాంతో ఫర్మాన్, రిజ్వాన్‌తో వాదనకు దిగాడు. కోపం ఆపుకోలేక దుకాణం గ్లాసును బద్దలుకొట్టాడు. దానితో ఫర్మాన్, రిజ్వాన్ , మరికొందరు కలిసి నిడోను చితకబాదారు. మరునాడి ఇతని మృతదేహం కనిపించింది.
‘ఈశాన్యం’లో అలజడి
గ్యాంగ్‌టక్: నిడో తనియా అనే అరుణాచల్‌ప్రదేశ్ యువకుడు ఢిల్లీలో జరిగిన దాడిలో మరణించినట్టు వచ్చిన వార్తలపై ఈశాన్య రాష్ట్రాల్లో కలకలం రేగింది. అక్కడ ప్రజాప్రతినిధులు, సామాజిక, విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. ‘టీవీలు, సామాజిక సంబంధాల వెబ్‌సైట్లలో ఈ ఘటనను చూసి సిక్కిం వాసులంతా దిగ్భ్రాంతి చెందారు. రాజధాని నడిబొడ్డున జరిగిన ఈ జాతివివక్ష దాడిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఢిల్లీలో ఈశాన్యవాసులపై తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి’ అని సిక్కిం ప్రజాఫ్రంట్ ప్రతినిధి, ఎంపీ పీడీ రాయ్ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల ఎంపీలంతా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయి దోషులను కఠినంగా శిక్షించాల్సిందిగా కోరుతామని ప్రకటించారు.
Advertisement