ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల్లో డబ్బు విచ్చలవిడిగా ఖర్చుచేయకుండా అడ్డుకునేందుకు లింగ్డో కమిటీ చేసిన సిఫారసులు అమల్లోకి రావడం విద్యార్థి సంఘం నాయకులతోపాటు అభ్యర్థులకు గొంతులో వెలక్కాయ పడినట్టయింది. ఈ ఆంక్షలపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వ్యయాన్ని కేవలం రూ.5,000లకే పరిమితం చేశారని, ప్రస్తుత ధరల నేపథ్యంలో ఈ మొత్తం తో ప్రచార పర్వాన్ని ముగించడం అత్యంత కష్టమని వారంటున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికలకు సంబంధించి జె.ఎం.లింగ్డో కమిటీ చేసిన సిఫారసులపై పలు రాజకీయ పార్టీలకు చెందిన అనుబంధ సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కండ బలం, ధనబలాన్ని నియంత్రించాలనే ఉద్దేశంతో ఎన్నికల వ్యయాన్ని రూ. 5,000లకే పరిమితం చేయాలంటూ లింగ్డో కమిటీ గతంలో చేసిన సిఫారసును డీయూ అమలుచేసింది. ఈ ఆంక్షలపై ఆయా సంఘాలు మండిపడుతున్నాయి.
భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషన ర్ నేతృత్వంలోని కమిటీ... ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయాన్ని రూ. 5,000లకే పరిమితం చేయాలంటూ 2005లో సిఫారసు చేసింది. ఈ సిఫారసులను అమలు చేయాలంటూ 2006లో అత్యున్నత న్యాయస్థానం డీయూని ఆదేశించింది. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అనుబంధ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) అధికార ప్రతినిధి అమ్రిష్ రంజన్ పాండే ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అమ్రిష్ వాదనను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ కార్యదర్శి రోహిత్ చాహల్ సమర్థించారు. ‘దాదాపు 50 కళాశాలల్లో ప్రచారం చేయాల్సి ఉంటుంది.
ఈ రూ. 5,000 పెట్రోలు ఖర్చులకు కూడా సరిపోవు. అందువల్ల పూర్తిస్థాయిలో ప్రచారం చేయడం సాధ్యపడదు. డీయూ మార్గదర్శకాల ప్రకారం కరపత్రాలను కూడా పంపిణీ చేయకూడదు. ప్రచారం కోసం చేతితో చేసిన పోస్టర్లనే వినియోగించుకోవాల్సి ఉంటుంది’ అని అన్నారు. ఇదే విషయమై ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ నాయకుడొకరు మాట్లాడుతూ ‘డబ్బు ఖర్చు చేయకూడదు. విరాళాలు స్వీకరించకూడదు.50 క ళాశాలల్లోనూ కరపత్రాలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇన్ని ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు ప్రచారం ఏవిధంగా చేయగలుగుతాం’ అని ప్రశ్నించారు. కాగా ఈ నెల 12వ తేదీన ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికలు జరగనున్నాయి.
ఇందుకు ఆయా విద్యార్థి సంఘాలు సన్నద్ధమవుతున్నాయి. అదే నెల మూడో తేదీలోగా అభ్యర్థులు తమ తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఐదో తేదీలోగా ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది డూసూకి జరిగిన ఎన్నికల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) విజయదుందుభి మోగించింది. అప్పటి ఎన్నికల్లో ఏబీవీపీ అభ్యర్థి రాజు సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అమన్ అవానా, ఉత్కర్ష్ చౌదరి అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఇక భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) కేవలం ఒక్కస్థానంలోనే జయకేతనం ఎగురవేసింది. ఆ సంఘం తరఫున బరిలోకి దిగిన కృష్ణ ఠాకూర్ కార్యదర్శిగా ఎన్నికైన సంగతి విదితమే.
గట్టి నిఘా ఉంచుతాం
ఇదే విషయమై ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థుల వ్యయానికి సంబంధించి గట్టి నిఘా ఉంచుతామన్నారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే జరిమానా విధిస్తామన్నారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తి లేదన్నారు.
ఇవేమి ఆంక్షలు?
Published Sun, Aug 31 2014 10:37 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement