జల్లికట్టు స్ఫూర్తితో మరో ఉద్యమం
బొమ్మనహళ్లి (బెంగళూరు): జల్లికట్టు కోసం తమిళనాడు ప్రజానీకం పోరాడిన స్ఫూర్తితో కర్ణాటకలోనూ తమ సంప్రదాయ కంబళ కోసం ప్రముఖులు గళమెత్తుతున్నారు. కర్ణాటకలోని మంగళూరు, ఉడుపి, దక్షిణ కన్నడ తదితర తీరప్రాంత జిల్లాల్లో బురద మడుల్లో ఎద్దులు, ఆంబోతులను కాడెకు కట్టి పరుగులు తీయిస్తారు. నిర్ణీత దూరాన్ని ముందుగా అధిగమించిన పశువులే ఈ పోటీలో విజేతలు. సంక్రాంతి తరువాత ఇది జోరుగా సాగుతుంది.
పశువులను హింసిస్తున్నారంటూ జంతుహక్కుల సంస్థ గతేడాది కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసి కంబళ జరపకుండా స్టే తెచ్చింది. దీంతో ఈ సంక్రాంతికి బురద మడులు బోసిపోయాయి. కంబళ క్రీడకు అనుమతి కోసం ప్రధాని మోదీతో చర్చిస్తానని కేంద్ర మంత్రి డి.వి.సదానందగౌడ చెప్పారు. బెంగళూరులో సోమవారం ఆయన మాట్లాడుతూ.. కంబళ క్రీడలో ఎలాంటి ప్రమాదాలూ, ప్రాణహాని ఉండదని అన్నారు.
మరో కేంద్రమంత్రి అనంత్‌కుమార్ మాట్లాడుతూ.. కంబళ క్రీడ కర్ణాటక ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. ఎడ్ల పందేలపై త్వరలో ప్రధానితో చర్చలు జరుపుతానని తెలిపారు. వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన కంబళ క్రీడను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప అన్నారు.