
భువనేశ్వర్ : రాష్ట్ర రాజకీయాల్లో గంజాం జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ జిల్లాకు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యం వహిస్తున్నారు. బిజూ జనతా దళ్‌లో తిరుగులేని నాయకుని గంజాం జిల్లా రాష్ట్రానికి అందజేస్తుందనే విశిష్టత సంతరించుకుంది. అంతే కాదు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడి రాజకీయాలతో అవినాభావ సంబంధాల్ని పెన వేసుకుని ఉంది. దేశానికి తెలుగు బిడ్డ దివంగత పి.వి.నరసింహారావును ప్రధానమంత్రిగా అందజేసిన ఘనత కూడా గంజాం జిల్లా సొంతం చేసుకుంది. విపత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆపన్న హస్తం అందజేసి ఆదుకున్న 1999వ సంవత్సరం నాటి పెనుతుపాను ఛాయలు నేటికీ చెరగని చరిత్రగా మిగిలిపోయాయి. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రేరణతో విపత్తు నిర్వహణలో ఒడిశా నేడు అంతర్జాతీయ స్థాయిలో యునెస్కో వంటి ప్రతిష్టాత్మక సంస్థల గుర్తింపు సాధించింది. ప్రపంచ దేశాలకు విపత్తు నిర్వహణలో మార్గదర్శిగా నిలిచింది. మారిన కాలమాన పరిస్థితుల దృష్ట్యా పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవిభక్త గంజాం జిల్లాలో రాజకీయ విస్తరణ కోసం యోచిస్తున్నట్లు రాజకీయ శిబిరాల్లో చర్చ సాగుతోంది. ప్రధానంగా తెలుగుదేశం ప్రాంతీయ పార్టీగా అంతర్ రాష్ట్ర తెలుగు ప్రజల్ని ఆకట్టుకునేందుకు లోపాయికారీగా రాజకీయ వ్యూహాన్ని ఆవిష్కరిస్తోంది. ప్రాచీన సంబంధ బాంధవ్యాల్ని తెరపైకి తీసుకు వచ్చి ఒడిశా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు మోపేందుకు తెలుగుదేశం సన్నాహాలు చేస్తోంది.
జిల్లాలో యువనాయకత్వం కొరత
గంజాం జిల్లాలో యువతరం నాయకుల కొరతతో ప్రధాన రాజకీయ పక్షాలు అల్లాడుతున్నాయి. వయోవృద్ధ నాయకులతో ఉభయ కాంగ్రెస్, అధికార పక్షం బిజూ జనతా దళ్ ఈ జిల్లాలో కాలక్షేపం చేయాల్సి వస్తోంది. వీరి తర్వాత ఉత్తరాధిపత్యం పగ్గాలు అందుకునేందుకు అవిభక్త గంజాం జిల్లాలో చురుకైన విద్యాధిక, రాజకీయ చాతుర్యత కలిగిన సారథుల్ని అన్వేషించడంలో ప్రధాన రాజకీయ పక్షాలు తలకిందులవుతున్నాయి. ఈ బలహీన పరిస్థితుల్ని సొమ్ము చేసుకునే ప్రయత్నంలో తెలుగుదేశం చొరబడి స్థానికంగా ప్రత్యక్ష పోటీకి యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
నవీన్ అటూ..ఇటు ..
గంజాం జిల్లా ప్రత్యక్ష రాజకీయాల్లో ఊహాగానాల మేరకు తెలుగుదేశం పార్టీ అడుగిడితే ఈ జిల్లా రాజకీయ ముఖ చిత్రం అకస్మాత్తుగా కొత్త కాంతుల్ని పుంజుకుంటుంది. అధికారంలో కొనసాగుతున్న బిజూ జనతా దళ్‌తో మిత్ర పక్షంగా తెలుగుదేశం పోటీ చేసేందుకు బీజేడీ శిబిరంలో అనుకూల వాతావరణం కనిపించడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చక్కని మిత్రులుగా చలామణి అవుతున్నారు. ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య పాలనాపరమైన విభేదాలు బలం పుంజుకున్నాయి. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్‌పై ఒడిశా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో కేసులు కూడా దాఖలు చేసింది. ఆంధ్రప్రదేశ్ దూకుడుని సవాల్ చేసింది. అయినా రాజకీయంగా ఎటువంటి వివాదాన్ని ప్రేరేపించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అత్యంత జాగరూకత ప్రదర్శించారు. తాజాగా ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్ పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రైల్వే జోన్ విషయంలో కూడా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చాకచక్యంగా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో మాకూ కావాలనే శీర్షికతో కేంద్రంలో ప్రభుత్వాన్ని మింగుడు పడని పరిస్థితిలో ఆట పట్టించారు. తాజాగా కొఠియా గ్రామాల వివాదంలో తెలుగుదేశం ప్రభుత్వం పాలన తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశా ప్రభుత్వ అధికారుల్ని రంగంలోకి దింపి ప్రత్యక్ష చర్యల్ని ప్రేరేపించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరబాటుతనంపై ఆంక్షలు విధించారు.
వైఎస్సార్‌సీపీ వైఖరిపట్ల ఉత్కంఠ
సరిహద్దు గంజాం జిల్లా రాజకీయాల్లో తెలుగు దేశం పార్టీ చొరబాటుపట్ల వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా ఆట పట్టిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కదలికపట్ల సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిపట్ల రాష్ట్ర ప్రజల్లో మిశ్రమ స్పందన ఉంది. పలు స్థానిక ప్రాంతీయ పార్టీలు ఆయన నేతృత్వంపట్ల మక్కువ కనబరుస్తున్నాయి. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా వైఎస్సార్‌సీపీ అధినేతపట్ల సదభిప్రాయంతో అడుగులు వేసిన సందర్భాలు లేకపోలేదు. రాష్ట్రాల ప్రయోజనాల పరిరక్షణలో బీజేడీ, వైఎస్సార్‌సీపీ నాయకుల కార్యాచరణలో సమతుల్యత తారసపడుతుంది. దక్షిణ ఒడిశాలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం తరచూ తారసపడుతుంది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ పరిస్థితులు మరింత స్పష్టమవుతాయని భావిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు అంతర్ రాష్ట్ర పార్టీలుగా ఆవిర్భవించి పోటీకి సిద్ధమవుతున్నట్లు రాజకీయ చర్చ సాగుతోంది.