ఉల్లి ధర మళ్లీ పెరిగింది
Published Tue, Oct 22 2013 12:28 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
న్యూఢిల్లీ: ఉల్లి లొల్లి మళ్లీ మొదలైంది. నగరంలోని మార్కెట్లలో ఉల్లి ధర కిలో రూ. 80 పలుకుతుండడంతో వాటివైపు చూసేందుకు కూడా సామాన్యుడు జంకుతున్నాడు. ఈజిప్లు, చైనా తదితర దేశాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కొత్త ఉల్లి నగరానికి దిగుమతి కావడంతో గత కొన్ని రోజులుగా హోల్‌సేల్ మార్కెట్లలో ఉల్లి నిల్వలు పేరుకుపోయాయి. దీంతో ధర ఒక్కసారిగా తగ్గింది. మార్కెట్‌లోకి కొత్త ఉల్లి వచ్చింది కదా అన్ని విదేశాల నుంచి దిగుమతిని నిలిపివేయడంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఆశించినమేర ఉల్లి రాకపోవడంతో ఉన్న నిల్వలు కూడా ఆవిరయ్యాయి.
ఇక సరిపడా ఉల్లి రాదనే మార్కెట్ సమాచారంతో వ్యాపారులు కూడా తమ వద్ద ఉన్న ఉల్లిని రేటు పెంచేసి విక్రయిస్తున్నారు. రెండ్రోజుల వ్యవధిలోనే ధర 30 శాతం పెరిగిందని చిల్లర వర్తకులు వాపోతున్నారు. ఈ విషయమై ఏపీఎంసీ చైర్మన్ రాజేంద్ర శర్మ మాట్లాడుతూ.. ‘పొరుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా ఉల్లి పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో ఆయా రాష్ట్రాలు ఢిల్లీకి ఎగుమతి చేసే ఉల్లిలో కోత విధిస్తున్నాయి.
ఫలితంగా నగరంలోని మార్కెట్లకు ఆశించిన స్థాయిలో ఉల్లి లోడ్లు రావడంలేదు. సరుకు కొరత ఉండడం, డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశముంది. అయితే ప్రభుత్వాలు ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటే పరిస్థితిలో మార్పు రావొచ్చు. రాజస్థాన్ నుంచి భారీగా ఉల్లి తరలిరానున్నట్లు సమాచారం అందుతోంది. ఒకవేళ అది ఢిల్లీవాసులకు అందుబాటులోకి వస్తే ధరలు ఊహించినదానికంటే కూడా తగ్గే అవకాశముంద’న్నారు.
Advertisement
Advertisement