
Omicron Scare న్యూఢిల్లీ: గడచిన 24 గంటల్లో దేశ రాజధానిలో 180 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఢిల్లీ హెల్త్ బులెటన్ శుక్రవారం తెలియజేసింది. జూన్ 16 తర్వాత నిన్న ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగింది. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ దృష్ట్యా కోవిడ్ ప్రోటోకాల్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఐతే గడచిన రెండు రోజుల వ్యవధిలో ప్రొటోకాల్ ఉల్లంఘనల వల్ల సుమారు 1.5 కోట్ల రూపాయల జరిమానాను వసూలు చేసినట్లు ఢిల్లీ ప్రభుత్వం శనివారం తెలిపింది. ఉల్లంఘనలకు సంబంధించి 163 ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదయ్యాయని పేర్కొంది. మాస్క్‌లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం, గుమిగూడినందుకు గాను ఈ జరిమానాలు విధించినట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.
కాగా గత 24 గంటల్లో దేశంలో 7,189 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం 415 ఒమిక్రాన్ వేరియంట్ కేసుల్లో, 115 మంది కోలుకున్నట్టు వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 108 ఒమిక్రాన్ కేసులు నమోదవగా, ఢిల్లీలో 79, గుజరాత్‌లో 43, తెలంగాణాలో 38, కేరళలో 37, తమిళనాడులో 34, కర్ణాటకలో 31 కేసులు నమోదయ్యాయి.
చదవండి: మద్యం తాగే వయసు 21 ఏళ్లకు కుదింపు! ఆ రాష్ట్రాల్లో పూర్తిగా నిషేధం..