న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారత్‌లో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 17 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక కేసు నమోదు కాగా, మరో 7 కేసులు మహారాష్ట్రలోని పుణె జిల్లాలో, రాజస్తాన్‌లో 9కేసులు బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 21కి చేరుకుంది. ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి జైపూర్‌కు తిరిగివచ్చిన ఒకే కుటుంబంలోకి నలుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయ్యింది.
వీరితో సన్నిహితంగా మెలిగిన మరో ఐదుగురికి కూడా సోకిందని వీరందరికీ చికిత్స అందిస్తున్నామని రాజస్తాన్ ప్రభుత్వం వెల్లడించింది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన ఓవ్యక్తి(37)కి ఒమిక్రాన్ వేరియెంట్ నిర్ధారణ అయిందని అధికారులు చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన 17 మందిని, వారిని కలుసుకున్న మరో ఆరుగురిని ఆస్పత్రి ఐసోలేషన్‌లో ఉంచారు. ఇప్పటివరకు 12 శాంపిల్స్‌ను జన్యుక్రమ విశ్లేషణకు పంపించగా ఒకటి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది.
నైజీరియా నుంచి వచ్చిన వారికి ఒమిక్రాన్
మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. నైజీరియా నుంచి ఒక మహిళ తన ఇద్దరు కుమార్తెలతో పింప్రి చించ్‌వాడ్‌కు వచ్చారు. వీరందరికీ ఒమిక్రాన్ సోకినట్టు తేలింది. ఫిన్లాండ్ నుంచి వచ్చిన మరొకరికి కూడా ఒమిక్రాన్ సోకింది. దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసులు 8కి చేరుకున్నాయి.
కేంద్రం పరిశీలనలో వ్యాక్సిన్ అదనపు డోసు
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడానికి టీకా అదనపు డోసు, ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది. దీనిపై చర్చించడానికి సోమవారం నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్‌టీఏజీఐ) సమావేశం కానుంది.
సగం మంది వయోజనులకు రెండు డోసులు
దేశంలో అర్హత కలిగిన వయోజనుల్లో సగం మందికి పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ జరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ చెప్పారు. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కోటికి పైగా టీకా డోసులు ఇవ్వడంతో సగం మంది అర్హులకు పూర్తి వ్యాక్సినేషన్ ఘనత సాధించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment