సాక్షి, హైదరాబాద్: అక్కడ ఉల్లి రైతులకు ‘మహా కష్టం వచ్చింది. ఇక్కడ వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. పక్కనే ఉన్న మహారాష్ట్రలో ధరల్లేక ఉల్లి పొలాల్లోనే మురిగిపోతోంది. ధర పలుకుతుందని మార్కెట్‌కు తెచ్చినా కొనేవారు లేక రోడ్ల పాలవుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదే మన నగరం విషయానికి వస్తే ధరల మోత మోగుతూనే ఉంది. సాధారణ రోజుల తరహాలోనే ఉల్లిగడ్డ ధర పలుకుతోంది.
గ్రేటర్ అవసరాల్లో ఎక్కువ శాతం మహారాష్ట్రలో పండించే ఉల్లే తీరుస్తోంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ధరలు పెరగగానే ఇక్కడ అమాంతం పెంచడం పరిపాటి. అలాంటిది అక్కడ ధరలు తగ్గితే.. ఇక్కడ కూడా తగ్గాలి. ధరలను నియంత్రించాల్సిన మార్కెటింగ్ శాఖ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. దీంతో మార్కెట్‌లో ధరలు తగ్గకపోగా.. ఇదే అదనుగా వ్యాపారులు మాత్రం ‘మహా’ నిల్వలు పెంచేసుకుంటున్నారు. తద్వారా ధరలు పెరిగితే భారీగా వెనుకేసుకునే ఎత్తుగడ వేశారు.
దిగుమతులు పెరిగినా..
మహారాష్ట్రలో కిలో ఉల్లి రూ. 2 నుంచి 4 పలుకుతుండగా.. నగర మార్కెట్లలో మాత్రం రూ.20 నుంచి 30 వరకు విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ లెక్కల ప్రకారం రోజు నగర మార్కెట్లకు దాదాపు 80 లారీల ఉల్లి దిగుమతి అవుతోంది. ఈ నెల ప్రారంభం నుంచే ఉల్లి దిగుమతులు క్రమంగా పెరుగుతున్నట్లు మలక్‌పేట్ మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో ఉల్లి కిలో రూ. 20 నుంచి 30 వరకు విక్రయించారు. దిగుమతులు పెరిగినా ఇప్పటికీ కూడా అవే ధరలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులు మహారాష్ట్ర వ్యాపారులతో కలిసి సిండికేట్‌గా మారి ఉల్లి ధరలు విపరితంగా పెంచారు.
గోదాంల్లో నిల్వలు..
ఇక్కడి వ్యాపారులు ముందే మహారాష్ట్ర వ్యాపారుల నుంచి సరుకులు ముందే కొనుగోలు చేసి వాటిని నగరానికి తరలించకుండా వారి గోదాంల్లో నిల్వ చేసుకుంటున్నారు. దీంతో నగరానికి సరఫరా తగ్గింది. పేరుకు మాత్రం నగరానికి సరుకు రాదు. కానీ వ్యాపారులు కొన్న సరుకులు మాత్రం అక్కడి వ్యాపారుల గోదాంల్లో నిల్వ ఉంటాయి. మహారాష్ట్ర వ్యాపారులకు రెండు రకాలుగా వ్యాపారం జరుగుతోంది. ఇక్కడి వ్యాపారులకు సరుకు అమ్మడంతోపాటు వాటిని నిల్వ చేసి ఉంచినందుకు కొంత చార్జీలను వసూలు చేస్తున్నారు. ఇలా కొన్నిరోజుల పాటు నగరానికి సరుకు సరఫరాను నిలిపివేయడంతో ఇక్కడి మార్కెట్లలో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
ఎక్కువ లాభం కోసం
ప్రస్తుతం తెలంగాణ జిల్లాల నుంచి నగర మార్కెట్లకు ఉల్లి దిగుమతులు అవుతున్నాయి. దీంతో కమీషన్ ఏజెంట్లు ఇక్కడి సరుకును మాత్రమే విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలో కొనుగోలు చేసిన సరుకును నిల్వ చేశారు. లోకల్ సరుకు తగ్గముఖం పడితే ధరలు పెంచి మహారాష్ట్ర సరుకును బయటికి తీస్తారు. ఇలా రూ. 2–4 మహారాష్ట్రలో కొన్న ఉల్లిని రూ. 25–30కి విక్రయించి ఎక్కువగా లాభం పొందుతారు. ఈ విషయంలో మార్కెటింగ్ శాఖ అధికారులు మాత్రం ఏమీ చేయడం లేదని రిటైల్ వ్యాపారులు అంటున్నారు. స్థానిక గోడాన్‌లో నిల్వ చేస్తే దాడులు చేసి సరుకులు పట్టుకునే వారని.. మహారాష్ట్ర వ్యాపారులతో చేతులు కలిపి అక్కడ సరుకులు నిల్వ చేస్తే ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని ఓ అధికారి తెలిపారు.
చదవండి: కాలేజీ యాజమాన్యమే మా కొడుకును చంపేసింది: సాత్విక్ పేరెంట్స్
Comments
Please login to add a commentAdd a comment