
ఫేస్‌బుక్‌లో అమ్మాయి ఫొటోతో 14 లక్షలు కుచ్చుటోపి
- ఫేస్‌బుక్‌లో అమ్మాయి ఫొటోతో అకౌంట్ ఓపెన్ చేసి మోసం
- మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆడ గొంతుతో ఎర
- కంప్యూటర్ వ్యాపారికి రూ. 14 లక్షలు కుచ్చుటోపి
- సైబర్ నేరగాడి అరెస్ట్
- వందమంది దాకా బేబీ బాధితులు
బెంగళూరు : సామాజిక వెబ్‌సైట్లు ఉపయోగించి కొందరు ఘరానా నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఫేస్‌బుక్‌లో ఓ అందమైన యువతి ఫొటో పెట్టి యువకులను ఆకర్షిస్తూ వారి నుంచి రూ. లక్షలు వసూలు చేస్తున్న ఓ మోసగాన్ని ఇక్కడి కేజీహళ్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కేజీహళ్లిలోని బిలాల్ నగరలో ఉంటున్న షేర్‌ఖాన్(23)ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇంటర్ చదివిన షేర్‌ఖాన్ మూడేళ్లుగా మంగళూరులో నివాసం ఉంటున్నాడు. డబ్బు సంపాదించడానికి ఒక పథకం వేశాడు.
ఒక అందమైన యువతి ఫొటోను సేకరించి ఫేస్‌బుక్‌లో బేబీ పేరుతో అకౌంట్ ప్రారంభించాడు. ఇక్కడి హెచ్‌ఆర్‌బీఆర్ లేఔట్‌లో నివాసం ఉంటున్న వాసీం అహమ్మద్ కుట్టి అనే యువ కుడితో ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్నాడు. కంప్యూటర్ విడి భాగాలు విక్రేత అయిన వాసీం సదరు ఫొటో యువతి అందానికి ముగ్ధుడై చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. కొన్ని నెలల పాటు చాటింగ్ అనంతరం మొబైల్ నెంబర్లు తెలుసుకున్నారు.
ఇదిలా ఉంటే వాసీం ఫోన్ చేసినప్పుడల్లా షేర్‌ఖాన్ తన స్వరాన్ని మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆడగొంతుతో మోసం చేసేవాడు. గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుకునేవారు. కొన్ని నెలల క్రితం షేర్‌ఖాన్ వాసీంకు ఫోన్ చేసి తాను గోవాలో ఉన్నానని, పర్సు పోయిందని డబ్బు పంపమని కోరాడు. తన ప్రియురాలు (షేర్‌ఖాన్) అడిగిందని వాసీం మూడు వేలు అకౌంట్‌లో వేశాడు. అదే విధంగా కొన్ని రోజుల క్రితం ఒక ఇంటి స్థలం పరిష్కారం కోసం రూ. లక్ష ఇవ్వాలని కోరాడు. పాపం అమాయక వాసీం చెప్పిన కొన్ని గంటల్లోనే రూ. లక్ష అకౌంట్‌లోకి జమ చేశాడు.
ఇలా తరచూ ఆడ గొంతుతో మోసం చేస్తూ వాసీం నుంచి రూ. 14 లక్షలు వసూలు చేశాడు. దీంతో విసిగి పోయిన వాసీం నేరుగా కలవాలని కోరాడు. దీంతో అనుమానించిన షేర్‌ఖాన్ వాసీంతో చాటింగ్, ఫోన్ చేయడం మానేశాడు. ఇదిలా ఉంటే ఫిబ్రవరిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వాసీం దుకాణంలోకి చొరబడి కంప్యూటర్లు ధ్వంసం చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన ఘరానా మోసం బయటపడుతుందని భావిం చిన షేర్‌ఖాన్ స్నేహితులతో కలిసి వాసీం దుకాణంపై దాడికి పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు.
షేర్‌ఖాన్ ఫేస్‌బుక్ ఆధారంగా ట్రాప్ చేసి అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు యువతి ఫొటోతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్ ప్రారంభించి, వివిధ సిమ్‌కార్డులు ఉపయోగించి 100 మందికి పైగా యువకులను మోసం చేశాడని విచారణలో వెలుగు చూసిందని పోలీసులు తెలి పారు. మోసం చేసిన నగదుతో షేర్‌ఖాన్ గోవా, ముంబాయి తదితర ప్రాంతాల్లో విలాసవంతమైన జీవితం గడిపేవాడని శనివారం కేజీ హళ్లి పోలీసులు తెలిపారు.