
ఛీ.. నీచరాజకీయాలు
ప్రభుత్వం ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది
గోహత్యా నిషేధ బిల్లుపై ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ విమర్శ
బెంగళూరు : గోహత్యా నిషేధ బిల్లును వెనక్కు తీసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్ విమర్శించారు. బెళగావిలోని సువర్ణసౌధ ప్రాంగణంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని గో సంపదను రక్షించడానికి బదులు నాశనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోందని విమర్శించారు. గోహత్యా నిషేధ బిల్లును వెనక్కు తీసుకోవడం నిజంగా దురదృష్టకరమైన విషయమని పేర్కొన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒక సమర్థవంతమైన ప్రతిపక్షంగా ఉత్తర కర్ణాటక ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తాము సమర్థవంతంగా ప్రశ్నించామని అన్నారు. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం ఇందుకు సరైన సమాధానం ఇవ్వకుండా కేవలం న ంబర్ గేమ్‌కు మాత్రమే పరిమితమయ్యారని ధ్వజమెత్తారు. ఉత్తర కర్ణాటక ప్రాంత అభివృద్ధికి వివిధ ప్యాకేజీల రూపంలో రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారని, అయితే ఇందులో ఎంతమేర నిధులు సద్వినియోగం అవుతాయో తెలియడం లేదని అన్నారు.
కళంకిత మంత్రులపై మా పోరాటం ఆగదు
అవినీతి మంత్రుల వ్యవహారాలపై చర్చ జరిపేందుకు తమకు అసెంబ్లీలో అవకాశం లభించలేదని, అయితే కళంకిత మంత్రులపై తమ పోరాటాన్ని మాత్రం ఆపబోమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత కేఎస్ ఈశ్వరప్ప పేర్కొన్నారు. సువర్ణసౌధ ఆవరణలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈశ్వరప్ప మాట్లాడారు. అవినీతి ఆరోపణలున్న మంత్రులు రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగబోదని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసినందున ఇక ఇప్పుడు తమ పోరాటాన్ని ప్రజల మధ్యే కొనసాగిస్తామని తెలిపారు.