పెరియార్‌కు 95 అడుగులతో విగ్రహం!
Published Sun, Nov 17 2013 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 12:40 AM
సాక్షి, చెన్నై : ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌కు 95 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడానికి నిర్మాణ వ్యయంగా రూ.30 కోట్లు అంచ నా వేశారు. మూడేళ్లల్లో పని ముగించేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ద్రవిడ కళగం నేత కీ.వీరమణి వెల్లడించారు. తమిళనాటపెరియార్‌గా పేరొందిన దివంగత ఈవీ రామస్వామి జాతీయ పార్టీలకు భిన్నంగా 1917లో ఆయన దక్షిణ భారత సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. 1944లో సేలంలో నిర్వహించిన సభ ద్వారా దక్షిణ భారత సంక్షేమ సంఘాన్ని ద్రవిడ కళగం (డీకే) పేరుతో ప్రాంతీయ పార్టీగా మార్చుతూ తీర్మానం చేశారు.
నాటి నుంచి ద్రవిడ సిద్ధాంతకర్తగా ద్రవిడుల హృదయాల్లో పెరియార్ చిరస్మరణీయుడయ్యారు. ఆయన విగ్రహం లేని ప్రాంతం రాష్ట్రంలో ఉండదు. ఆయన పేరిట వర్సిటీలు, విద్యాసంస్థలు, కార్యాలయాలు, భవనాలు కొలువుదీరాయి. ప్రస్తుతం తిరుచ్చి వేదికగా పెరియార్ భారీ విగ్రహం రూపుదిద్దుకోబోతున్నది. గుజరాత్‌లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నిలువెత్తు విగ్రహం కొలువు దీరబోతుంటే, ఇక్కడ ద్రవిడ కళగం నేత కీ వీరమణి నేతృత్వంలో 95 అడుగుల పెరియార్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.
విగ్రహం: తంజావూరులో శనివారం మీడియాతో వీరమణి మాట్లాడుతూ, తిరుచ్చి - చైన్నై జాతీయ రహదారిలోని సిరుగనూర్‌లో అతి పెద్ద పెరియార్ విగ్రహం ఏర్పాటు చేయనున్నామన్నారు. మూడేళ్లల్లో పనులు ముగించి పెరియార్ 150వ జయంతి నాడు ప్రారంభోత్సవం చేయనున్నట్లు వివరించారు. ప్రపంచ దేశాల్లోని తమిళులకు గర్వకారణంగా ఉండే విధంగా ఈ విగ్రహం ఏర్పాటు అవుతుందని పేర్కొన్నారు. మతతత్వ పార్టీలు అధికారంలోకి రాకూడదన్నదే ద్రవిడ కళగం నినాదం అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పెరియార్ ఆశయాలు, సిద్ధాంతాలే లక్ష్యంగా ముందుకె ళుతున్న ద్రవిడ పార్టీలతోనే కలసి తాము పనిచేస్తామన్నారు. ముల్లివాక్కాయ్ స్మారక ప్రదేశంలో ప్రహరీగోడ తొలగించడం దురదృష్టకరంగా పేర్కొన్నారు. జైల్లో ఉన్న నెడుమారన్‌తో సహా అందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement