నాసిక్: నాసిక్ రోడ్ సెంట్రల్ జైల్లోని ఖైదీలు ఇక తమ బంధువులకు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇటీవల ఠాణే, తలోజా కారాగారాల్లోని ఖైదీలకు ఫోన్ కాల్ అవకాశం కల్పించినట్టుగానే... నాసిక్ జైల్లో ఖైదీలకు కూడా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. సుదూర గ్రామాల నుంచి జైల్లో ఉన్న తమ బంధువులను చూడటానికి వచ్చేవారికి ఇకనుంచి ఆ ప్రయాణభారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకే రెండు ఫోన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనను పంపినట్టు నాసిక్ రోడ్ కేంద్ర కారాగార అధికారులు తెలిపారు. ‘దీనిని ప్రయోగాత్మకంగా ఠాణే కేంద్ర కారాగారంతోపాటు తలోజా జైలులో ఈ సౌకర్యాన్ని కల్పించామని, అలాంటిదే ఇప్పుడు నాసిక్ రోడ్ కేంద్ర కారాగారంలో కూడా ఏర్పాటు చేయనున్నామ’ని చెప్పారు.
విషయమై ఉన్నతాధికారులతో చర్చించామని జైలు సూపరింటెండెంట్ జయంత్ నాయక్ తెలిపారు. నెలకు రెండుసార్లు తమ బంధువులతో 10 నిమిషాలపాటు మాట్లాడుకునే అవకాశం కల్పిస్తున్నట్లు జైలు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ సౌకర్యాన్ని ఖైదీలు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నారు. నాసిక్ రోడ్ కేంద్ర కారాగారంలో ప్రస్తుతం 2,290 మంది ఖైదీలుండగా, వీరిలో 1,600మంది జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. వారానికోసారి తమ బంధువులను కలిసే అవకాశం ఖైదీలకు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. సుదూరంగా ఉన్న బంధువులు ఎప్పుడు పడితే అప్పుడు కలవడానికి అవకాశం ఉండదు. దీంతో తమ కుటుంబం, పిల్లలు, జీవిత భాగస్వాములు ఎలా ఉన్నారనే ఆలోచన ఖైదీలను మానసిక ఆందోళనకు గురిచేస్తుంది.
ఇలాంటి భావోద్వేగాలతోనే కొన్ని వారాల కిందట ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఖైదీలు గందరగోళానికి గురవకుండా ఉండేందుకే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తమ బంధువులతో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ కేంద్ర కారాగారానికి ఒక మానసిక వైద్యుడు కూడా అవసరమని సంబంధిత అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర కారాగారంలో అలాంటి పదవి ఇంతవరకూ ఆమోదం పొందలేదు.
ఇక హాయిగా మాట్లాడుకోవచ్చు
Published Tue, May 13 2014 10:39 PM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM
Advertisement