
ఫోన్ ఆన్సర్ చేస్తుంటే.. పేలిపోయింది!
ఫోన్ చార్జింగ్‌లో ఉండగా రింగ్ అయినప్పుడు అలాగే ఉంచి దాన్ని ఆన్సర్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. ఎందుకంటే, చెన్నై నగరంలో అలాగే చార్జింగ్‌లో ఉన్న ఫోన్‌ను తొమ్మిదేళ్ల బాలుడు ఆన్సర్ చేయబోతుండగా అది పేలిపోయింది. దాంతో అతడి కంటి చూపు దారుణంగా దెబ్బతింది. ధనుష్ అనే ఆ బాలుడిని వెంటనే మదురాంతకంలో ఉన్న కంటి ఆస్పత్రికి తరలించారు.
అతడు ఫోన్ ఆన్సర్ చేస్తుండగానే అది పేలిపోవడంతో ముఖం మీద, కళ్లు, చేతుల మీద కూడా తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. పేలుడు తీవ్రత వల్ల అతడి కుడి కంటి కార్నియా దెబ్బ తినడమే కాక, ఎడమ కంటి గ్లోబును కూడా బాగా పాడుచేసిందని, ఫోను పట్టుకున్న కుడి చేతికి కూడా బాగా కాలిన గాయాలయ్యాయని చికిత్స అందిస్తున్న డాక్టర్ వహీదా నజీర్ చెప్పారు. మూడు వారాల తర్వాత అతడికి చికిత్స పూర్తయ్యి ఇంటికి వెళ్లొచ్చని వివరించారు.