ఐ లవ్ యూ రా.. ప్లీజ్ తిరిగిరారా!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 4న జరిగిన మెర్సిడెస్ హిట్ అండ్ రన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సిద్దార్థ శర్మ జ్ఞాపకాలను అతని సోదరి శిల్పా శర్మ ఫేస్బుక్లో పంచుకుంది. సిద్ధార్థ బతికుంటే జూన్ 5న 33వ ఏట అడుగుపెట్టేవాడని పేర్కొంది. అతనితో దిగిన ఫొటోలను శిల్ప పోస్ట్ చేసి.. సోదరుడికి ఓ లేఖ రాసింది.
'నీ పుట్టినరోజున బాధగా ఉండాలని భావించడం లేదు. నాకు తెలుసు నీవు మా మధ్యే ఉన్నావు. నన్ను చూడగలవు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లినందుకు బాధగా ఉంది. నిన్ను నా తమ్ముడిగా ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఐ లవ్ యూ. ప్రతి క్షణాన్ని మిస్సవుతున్నా. జరిగిన దారుణం మరచిపోవడం తేలికకాదు. నీతో కలసి పెరిగిన జ్ఞాపకాలు ఎంతో అద్భుతమైనవి. నీవు నా సోదరుడు అయినందుకు గర్వంగా ఉంది. నీలోని మానవత్వానికి మరింత గర్వంగా ఉంటుంది. నీ చిరునవ్వు ఎప్పటికీ నాలో పదిలంగా ఉంటుంది. ఐ లవ్ యూ. ప్లీజ్ కమ్ బ్యాక్. ఏదో ఒక రోజు నీవు తిరిగొచ్చి.. మళ్లీ వచ్చానని చెబుతావని ఆశిస్తున్నా'.. అంటూ శిల్ప రాసిన లేఖను ఆమె ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది.
ఫేస్బుక్లో 'మెర్సిడెస్ హిట్ అండ్ రన్' పేరుతో ఓ ఎకౌంట్ క్రియేట్ చేసి.. ప్రమాదం జరిగినప్పటి దృశ్యాలతో కూడిన సీసీటీవీ ఫుటేజీని పోస్ట్ చేశారు. మీడియా ప్రమాద ఘటన వెలుగులోకి తేవడంతో పాటు పోలీసులు నిందితుడైన మైనర్ బాలుడిపై చర్యలు తీసుకునేలా ఈ ఫేస్ బుక్ పోస్టింగ్ దోహదం చేసింది. మార్కెటింగ్ ప్రొఫెసనల్ అయిన సిద్ధార్థను ఏప్రిల్ 4న మెర్సిడెస్ కారు ఢీకొనడంతో 15 అడుగుల ఎత్తుకు ఎగిరిపడి తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో మరణించాడు. వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన మైనర్ బాలుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కేసు విచారణ సాగుతోంది. సిద్ధార్థకు న్యాయం జరగాలని పోరాడుతున్నవారికి అతని జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఆదివారం ఇంట్లో తేనీరు ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు.