సీఎం అభ్యర్థిగా అన్బుమణి
పీఎంకే సీఎం అభ్యర్థిగా ఎంపీ అన్బుమణి రాందాసు పేరును ప్రకటించేందుకు ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు సిద్ధమయ్యారు. సేలం వేదికగా ఈనెల 15న అన్బుమణి పేరును ప్రకటించేందుకు కసరత్తుల్ని వేగవంతం చేశారు. మహానాడు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.
సాక్షి, చెన్నై : వన్నియర్ సంఘాన్ని రాజకీయ పార్టీగా ప్రకటించిన పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు ఏదో ఒక రోజు తాము రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపడతామన్న ఆశాభావంతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికల ముందు తామెవ్వరితోనూ పొత్తులు పెట్టుకోమని స్పష్టం చేస్తూనే, ఎన్నికల వేళ ఎవరితోనో ఒకరితో జతకట్టడం ఆయనకు పరిపాటే. అయితే, ఇటీవలి కాలం గా జరిగిన ఎన్నికల్లో పొత్తులు మార్చి మార్చి పెట్టుకున్నందుకు ఆయనకు ఆ సామాజిక వర్గం ఓటర్లే పెద్ద గుణపాఠం చెప్పారు. దీంతోఒకరి గొడుగు నీడన చేరడం కన్నా, తామే ఒక కూటమికి నేతృత్వం వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు సమూహ జననాయగ కూట్టని (సోషియల్ డెమాక్రటిక్ అలయన్స్) ను ప్రకటించారు. అన్ని కుల సంఘాలు, పార్టీలను ఏకం చేయడంతో పాటుగా అసెంబ్లీ ఎన్నికల్లో తమ నేతృత్వంలోని కూటమిలోకే ఇతర పార్టీలు రావాలన్న నిర్ణయంతో అడుగులు వేస్తున్నారు.
సీఎం అభ్యర్థిగా అన్భుమణి: సోషియల్ డెమోక్రటిక్ అలయన్స్‌లోకి కొన్ని చిన్న చిన్న పార్టీలతో సహా, కుల సంఘాలు వచ్చి చేరుతోండడంతో, తమ దైన శైలిలో ముందుకు సాగాలనుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి అడుగులు వేసిన ఆయన ఇప్పుడు ఆ కూటమిలో ఉన్నామా లేదా..? అన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయడం లేదు. దీనికి ముగింపు పలకడంతో పాటుగా, ఎవరైనా సరే ఇక, తమ కూటమిలోకి రావాల్సిందేనని చాటే విధంగా భారీ మహానాడుకు నిర్ణయించారు. సేలం వేదికగా ఈ నెల 15న భారీ ఎత్తున ఈ మహానాడుకు కసరత్తులు చేపట్టారు. చెన్నై-సేలం జాతీయ ర హదారిలోని ఇరుమలై లో 250 ఎకరాల విస్తీర్ణంలో ఈ మహానాడు ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు.
ఇందుకు తగ్గ పనుల్ని వేగవంతం చేయిస్తూనే, ఈ మహానాడు వేదికగా పార్టీ వర్గాల అభిప్రాయం, నిర్ణయం మేరకు తన వారసుడు, ఎంపీ అన్భుమణి రాందాసును పీఎంకే కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించేందుకు సిద్ధం అయ్యారు. ఈ వేదిక మీదుగా ఈ ప్రకటనను తప్పకుండా రాందాసు చేయబోతున్నారని, ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పీఎంకే - బీజేపీల కూటమి బెడిసి కొట్టినట్టేనన్నది ఖాయం అవుతోంది. ఇప్పటికే శ్రీరంగం ఉప ఎన్నికల్లో మద్దతు తిరస్కరించిన రాందాసు, ఇక బీజేపీకి వ్యతిరేకంగా వ్యవహరించడంతో పాటుగా అన్భుమణి సారథ్యంలో బలోపేతం లక్ష్యంగా ఉరకలు తీయడానికి రెడీ అయ్యారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం