నగర ట్రాఫిక్ పోలీసు అదనపు కమిషనర్ ఆర్.హితేంద్ర
సాక్షి, బెంగళూరు: ‘నగరంలోని ప్యాలెస్ మైదానంలో రేపు సాయంత్రం పెద్దల పెళ్లి జరుగుతోంది. ప్యాలెస్ మైదానం వైపుగా వెళ్లకుండా వాహనదారులు ప్రయాణం మళ్లించుకోండి’ ఇది సాక్షాత్తు నగర ట్రాఫిక్ పోలీసు అదనపు కమిషనర్ ఆర్.హితేంద్ర చేసిన ట్వీట్. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోంది. ఆదివారం బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ కుమారుడు సూరజ్ గౌడ్ వివాహం జరిగింది. ఈ వివాహం నేపథ్యంలో ట్రాఫిక్ కమిషనర్ ఈ మేరకు నగర పౌరులకు ట్వీటర్ విజ్ఞప్తి చేశారు.
దీనిపై నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. బెంగళూరు విమానాశ్రయాన్ని నేరుగా చేరుకోవడానికి ఇదే అత్యుత్తమ మార్గమని, దారి మళ్లించుకోవడం కుదరదని నెటిజన్లు గట్టిగా చెప్పారు. పెద్దల కోసం సామాన్యులు ఎందుకు దారి మళ్లించుకోవాలంటూ మరికొందరు ఘాటుగా ప్రశ్నించారు. నెటిజన్ల ట్వీట్లకు హితేంద్ర కూడా ఘాటుగానే బదులిచ్చారు. పెద్దల పెళ్లి ఉంది కాబట్టి చాలా మంది ప్రముఖులు వివాహానికి హాజరవుతారని, ఈ క్రమంలో ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తే ప్రమాదముందని, అందుకే ప్రజలకు తెలియజేద్దామని సూచించినట్లు తెలిపారు. ఇది కేవలం ఒక సూచన మాత్రమేనని, నిబంధన కాదని వెల్లడించారు. నగరవాసులు ట్రాఫిక్ ఇబ్బందులు పడకూడదనే ఉద్ధేశంతో తాను ట్వీట్ చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment