లగ్జరీ రేసింగ్!
ఈసీఆర్‌లో హల్‌చల్
పోలీసులకు ముచ్చెమటలు
తొమ్మిది కార్ల పట్టివేత
చెన్నై:
ఈసీఆర్ రోడ్డులో లగ్జరీ కార్లు రేసింగ్‌లో దూసుకెళ్లాయి. సంపన్నుల పిల్లలు హల్‌చల్ సృష్టిస్తూ సాగించిన ఈ రేసింగ్ పోలీసులకే ముచ్చెమటలు పట్టించాయి. చివరకు పోలీసులు కన్నెర్ర చేయడంతో తొమ్మిది లగ్జరీ కార్లు, అందులో ఉన్న పదిహేను మంది చిక్కారు. మరో ఆరు కార్లు తప్పించుకున్నాయి. చెన్నై నుంచి పుదుచ్చేరి వరకు ఈసీఆర్ రోడ్డులో పయనం ఆహ్లాదకరమే. సముద్ర తీరం వెంబడి సాగే ఈ పయనంలో తళతళమని రోడ్లు మెరుస్తుంటాయి. ఈ రోడ్డులో నిత్యం వాహనాలు అతివేగంగా దూసుకెళుతుంటాయి. రాత్రుల్లో అయితే, మోటార్ సైకి ల్, కార్ల రేసింగ్ జోరుగానే సాగుతుంటాయి. ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం స్పందించే పోలీసులు, తదుపరి యథారాజా తథా ప్రజా అని వ్యవహరిస్తుంటారు.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం అత్యంత ఖరీదైన పదిహేను కార్లు చెన్నై నుంచి ఈసీఆర్ రోడ్డులో పుదుచ్చేరి వైపుగా దూసుకెళ్లడాన్ని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. అతి వేగంగా దూసుకెళ్తున్న ఈ కార్లతో ఇతర వాహనదారులు, రోడ్డు మీద వెళ్లే ప్రజలకు ప్రమాదాలు తప్పవేమో అనే ఆందోళన కలిగింది. తక్షణం ట్రాఫిక్ పోలీసులు వైర్లస్ ఫోనుల్లో నీలాం కరై ఏసీ ఏకే పాండియన్, ఇన్‌స్పెక్టర్ రమేష్‌లకు సమాచారం ఇచ్చారు. కానాత్తూరు వద్ద రేసింగ్‌లో దూసుకెళుతున్న కార్లను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే, వారికి ముచ్చెమటలు పట్టిస్తూ, ఆ కార్లు దూసుకెళ్లాయి. తక్షణం ఉత్తండి టోల్‌గేట్ వద్ద ఆ వాహనాలను అడ్డుకునేందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేశారు. టోల్‌గేట్‌కు ఆ కార్లు సమీపించగానే, గేట్లు మూత వేయడానికి చర్యలు తీసుకున్నారు. అప్పటికే ఐదు కార్లు టోల్ గేట్‌ను దాటడంతో, పది కార్లును చుట్టుముట్టారు. తమను పోలీసులు చుట్టుముట్టడంతో ఆగ్రహించిన అందులో ఉన్న సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లాలు తమ వీరంగాన్ని ప్రదర్శించే యత్నం చేశారు. కాసేపు హల్‌చల్ సృష్టించారు. పోలీసులకే ముచ్చెమటలు పట్టించే విధంగా బెదిరింపులు, హెచ్చరికలు ఇచ్చారు.
చివరకు ఓ కారును పోలీసు వలయాన్ని ఛేదించి, సౌందర పాండియన్ అనే పోలీసును ఢీకొట్టి అందులో ఉన్నవారు ముందుకు నడిపారు. ఆ కారును అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పోలీసుల్లో ఒక్కసారిగా ఆగ్రహం బయలు దేరింది. మిగిలిన తొమ్మిది కార్లను అందులో ఉన్న పదిహేను మందిని అదుపులోకి తీసుకుని కానాత్తూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. పట్టుబడ్డ వాళ్లను వదలిపెట్టాలని పలు చోట్ల నుంచి ఫోన్లు వచ్చినా, పోలీసులు ఏమాత్రం తగ్గలేదు. ఇందుకు కారణం తమ పోలీసు గాయపడడమే. పట్టుబడ్డ కార్లు ఒక్కొక్కటి కొన్ని లక్షలు విలువ చేస్తాయి. ఈ కార్లను చూడడానికి జనం ఎగబడ్డారు.