![దోపిడీకి వచ్చి... దొరికిపోయి.. - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/61422392635_625x300.jpg.webp?itok=gVqAKnkO)
దోపిడీకి వచ్చి... దొరికిపోయి..
దొంగలపై పోలీసు కాల్పులు
యలహంక : ఇంటిలో ఎవరు లేరని గమనించి దుండగులు దోపిడీకివచ్చి చివరకు పోలీసు కాల్పుల్లో గాయపడిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున విద్యారణ్యపుర పోలీసు స్టేషన్ పరిధిలోని సప్తగిరి లేఔట్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... సప్తగిరి లేఔట్‌లోని సోమన్న గార్డెన్‌లో మురళీమనోహర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. మంగళవారం తెల్లవారు జామున సుమారు 4 గంటల సమయంలో బెంగాల్‌కు చెందిన ఆదిల్ (34), నిఖిల్(24) దోపిడీ కోసం ఇంటిలోకి ప్రవేశించారు. అదే సమయంలో దుండగులు రౌండ్‌సలో ఉన్న పోలీసుల కంటపడ్డారు. సమాచారాన్ని హుటాహుటిన ఎస్‌ఐ పునీత్‌కు చేరవేశారు. వెంటనే ఆయన సిబ్బందితో ఆ ఇంటిని చుట్టుముట్టారు.
అప్పటికే ఇంటిలో బంగారు, వెండి నగలను మూటకట్టుకుని వస్తుండగా బయట పోలీసులు వస్తున్న విషయం దుండగులు పసిగట్టారు. వెనుకవైపు ఉన్న కిటికిని తొలగించాలని ప్రయత్నించారు. పోలీసులు అక్కడ ఉండటంతో మారణాయుధాలతో బెదిరించి బెడ్‌రూంలో దాక్కున్నారు. పోలీసులు పలుమార్లు హెచ్చరికలు చేసిన దుండగులు బయటకు రాకపోవడంతో తుపాకీలకు పనిచెప్పారు. వారిపై కాల్పులు జరపడంతో వారు గాయపడ్డారు. ఇద్దరిని హుటాహుటిన విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. వారి వద్ద నుంచి సుమారు 5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.