సీఎం ఎవరు ?
ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పుపై ఉత్కంఠకు శనివారం సాయంత్రం తెరపడింది. జయకు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో కాబోయే సీఎం ఎవరో అనే చర్చకు తెరలేచింది. పన్నీరు సెల్వం, షీలా బాలకృష్ణన్‌కు అవకాశాలున్నా యన్న చర్చ మొదలైంది.
చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు పాలుకావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. సీఎం కుర్చీ ఖాళీ కావడంతో ప్రభుత్వంలో సైతం సీను మారిపోగా, కాబోయే సీఎం ఎవరనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో మూడు పేర్లు షికా రు చేస్తున్నాయి. జయకు జైలు శిక్ష పడిన పక్షంలో మళ్లీ ఆమె బయటకు రాగానే సీఎం కుర్చీని అప్పగించే వ్యక్తికే ఇప్పుడు ఆ పదవి వరిస్తుంది. బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పేందుకు వారంరోజుల ముందు నుంచే శిక్షపై అమ్మకు అనుమానం వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అందు కే ముగ్గురు విశ్వాస పాత్రులను జయ ముందుగానే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు మంత్రులు కాగా, మరొకరు మాజీ ఐఏఎస్ అధికారిణి అని అంటున్నారు. ఎంజీఆర్ హయాం నుంచి జయకు అత్యంత విశ్వసనీయపాత్రుడైన ఆర్థిక మంత్రి ఓ పన్నీర్‌సెల్వం, రవాణాశాఖా మంత్రి సెంధిల్ బాలాజీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణన్ పేరును సైతం అమ్మ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన షీలాకు మంచి పరిపాలనా అనుభవం ఉంది.
అంతకంటే ముఖ్యంగా జయకు అత్యంత నమ్మకస్తురాలు. అందుకే రిటైర్మెంటు అయిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా షీలాను జయ తన వద్దనే ఉంచుకున్నారు. ప్రస్తుతం సీఎం పదవి దక్కించుకోవడానికి ఈ ముగ్గురిలో షీలాకే ఎక్కువ అవకాశాలు ఉన్నారుు. అమ్మకు దత్తపుత్రుడిగా పేరొందిన సెంథిల్ బాలాజీ నమ్మకస్తుడైనా వయస్సులో మరీ పిన్నవాడు కావడం అమ్మను ఆలోచింపచేసి ఉండొచ్చు.
సహజంగా ఎవరికీ రెండోసారి మంచి అవకాశం ఇచ్చే అలవాటులేని అమ్మ... పన్నీర్‌సెల్వంను పక్కన పెట్టవచ్చు. పార్టీ పరంగా అనుభవజ్ఞుడైన పన్నీర్‌సెల్వంకు పార్టీ, పరిపాలనా పరంగా అనుభవం, ఉన్నత విద్యార్హత కలిగిన షీలా బాలకృష్ణన్‌కు ప్రభుత్వ పగ్గాలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజా తీర్పును కలుపుకుంటే జయ రెండుసార్లు జైలుకెళ్లినా సీఎం హోదాలో కటకటాలపాలు కావడం ఇదే మొదటిసారి. ఈ అప్రతిష్ట రాబోయే ఎన్నికల్లో పార్టీ జయాపజయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
జయకు పడిన శిక్షను రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలు ప్రధానాస్త్రంగా మార్చుకుంటాయి. ప్రతిపక్షాల విమర్శనాస్త్రాలను దీటుగా ఎదుర్కొని పార్టీని అధికారంలో తేవాల్సిన బాధ్యతను కొత్త వ్యక్తి మోయూల్సి ఉంటుంది. ఇటుంటి గడ్డు పరిస్థితుల్లో కాలం చెల్లిపోతున్న ప్రభుత్వం కంటే మళ్లీ అధికార పీఠాన్ని ఎక్కించగలిగే పార్టీ బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగా పార్టీ నడిపే బాధ్యతలను పన్నీర్‌సెల్వంపై పెట్టి, ప్రభుత్వ పగ్గాలను షీలా బాలకృష్ణన్‌కు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.