Sheela Balakrishnan
-
జయ సన్నిహితురాలి అనూహ్య నిర్ణయం!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు పరిపాలన బాధ్యతలను ఒంటిచేత్తో నడిపించిన షీలా బాలకృష్ణన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జయలలితకు నమ్మకస్తురాలైన అధికారిగా పేరొందిన ఆమె తాజాగా ముఖ్యమంత్రి సలహాదారు పదవికి రాజీనామా చేశారు. నిజానికి షీలా బాలకృష్ణన్ పదవీకాలం మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవాలని ఆమెను ప్రభుత్వమే కోరినట్టు విశ్వసనీయవర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు ఆమె రాజీనామా గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ సన్నిహితులతో మాత్రం తాను రాజీనామా చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నట్టు మీడియా కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, శశికళ ఆధిపత్యం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జయలలిత హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శులుగా పనిచేసిన ఇద్దరు అధికారులు కేఎన్ వెంకటరామన్, ఏ రామలింగంలను ముఖ్యమంత్రి కార్యాలయం తొలగించింది. ఈ నేపథ్యంలోనే షీలా బాలకృష్ణన్‌ను తప్పిస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరికొంతమంది కీలక అధికారులను అటు-ఇటు మార్చవచ్చునని వినిపిస్తోంది. 2014లో రిటైరైన షీలా బాలాకృష్ణన్ (62) శక్తియుక్తులపై అపార నమ్మకముండటంతోనే ఆమెను తన సలహాదారుగా జయలలిత నియమించుకున్నారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన షీలా 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. జయలలిత అనారోగ్యంతో ఉన్నప్పుడు 75 రోజుల పాటు పరిపాలన బాధ్యతలను షీలా బాలకృష్ణన్‌నే నిర్వహించారు. జయలలిత మృతి తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమెకు ప్రస్తుతం ప్రాధాన్యం తగ్గిందని, ఈ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసినట్టు వినిపిస్తోంది. -
జయ లేకున్నా రాష్ట్రాన్నినడిపిస్తోంది
-
జయ లేకున్నా రాష్ట్రాన్నినడిపిస్తోంది ఆమెనే!
ఒకవైపు అమ్మ ఆస్పత్రిలో ఉన్నారు. ఆమె గురించి రాష్ట్రమంతా కలత చెందుతోంది. అయినా, అధికార యంత్రాంగం మాత్రం ఒకవైపు సీఎం జయలలిత గురించి ఆందోళన చెందుతూనే.. మరొకరి ఆదేశాలు, సూచనల కోసం క్యూ కడుతోంది. ఆమెనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి షీలా బాలకృష్ణన్. తీవ్ర అనారోగ్యంతో తమిళనాడు సీఎం జయలలిత ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రాన్ని నడిపించే బాధ్యత ఆమె తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్నతాధికారులు మాత్రమే కాదు.. మంత్రులు సైతం ఆమె సూచనల ప్రకారమే నడుచుకుంటున్నారు. 2014లో రిటైరైన షీలా బాలాకృష్ణన్ (62) శక్తియుక్తులపై అపార నమ్మకముండటంతోనే ఆమెను సలహాదారుగా జయలలిత నియమించుకున్నారు. ఇప్పుడు ఆమె అనారోగ్యంతో ఉండటంతో ఆమె స్థానంలో పరిపాలన బాధ్యతలను షీలా బాలకృష్ణన్‌నే నిర్వహిస్తున్నారని, ఈ రోజు ఆమె రాష్ట్రంలో అత్యంత కీలక వ్యక్తిగా మారారని, ఆమె సమ్మతి లేకుండా ఏమీ జరగడం లేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. జయలలిత ఆస్పత్రి పాలై దాదాపు పదిరోజులు అవుతోంది. ఆమె లేకున్నా పరిపాలన ఎలా ముందుకు కొనసాగుతుందనే దానిపై పెదవి విప్పడానికి అధికార వర్గాలు కానీ, సీనియర్ మంత్రులు కానీ ఒప్పుకోవడం లేదు. జయలలిత కన్నుసన్నల్లో ఉండే అన్నాడీఎంకే నేతలు కూడా ఈ విషయంలో స్పందించి.. అమ్మ కోపానికి గురికావడం ఇష్టంలేక మిన్నకుండిపోతున్నారు. జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రిలోని.. ఆమె ఉన్న గది సమీపంలోనే ఓ గదిలో షీలా బాలాకృష్ణన్ ఉంటున్నారు. అదే అంతస్తులో ఆమె పక్క గదిలో శశికళ బస చేశారు. జయలలిత ఆరోగ్యాన్ని వాకబు చేసేందుకు ఆస్పత్రికి వస్తున్న ఉన్నతాధికారులు అదే సమయంలో పరిపాలన విషయంలో షీలా బాలాకృష్ణన్ సూచనలు తీసుకుంటున్నారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన షీలా 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆమె రిటైరైన తర్వాత తన సలహాదారుగా జయలలిత నియమించుకున్నారు. జయలలితకు అత్యంత విశ్వసనీయురాలైన సలహాదారుగా పేరొందిన షీలా బాలాకృష్ణన్ సలహాల మేరకే తమిళనాడు చీఫ్ సెక్రటరీ పీ రామమోహన్‌రావు, డీజీపీ టీకే రాజేంద్రన్ నడుచుకుంటున్నారు. జయలలిత అందుబాటులో లేకపోవడంతో మొత్తం పరిపాలన అంతా షీలా సూచనలమేరకు జరుగుతోందని అంటున్నారు. కీలక అన్నాడీఎంకే మంత్రులైన పన్నీర్ సెల్వం వంటి వారు కూడా పరిపాలనలో షీలా సూచనల ప్రకారమే నడుచుకుంటున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో పరిపాలన స్తంభించిపోకుండా, ఎలాంటి చిక్కులు రాకుండా ఆమె సమర్థంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అధికార వర్గాలు అంటున్నాయి. -
జయలలిత ఆస్పత్రిలో.. పరిపాలన ఆమె చేతిలో..!!
చెన్నై: రెండు వారాలుగా తమిళనాడు ముఖమంత్రి జయలలిత తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జయకు అత్యంత విశ్వాస పాత్రులైన శశికళ, పన్నీరు సెల్వంలు సైతం ఆస్పత్రి చుట్టూనే తిరుగుతున్నారు. ఈ క్రమంలో పార్టీ క్యాడర్‌ను, మంత్రులను, అధికారులను ఎవరు సమన్వయ పరుస్తున్నారు? కావేరీ జల వివాదం లాంటి విషయాలను ఎవరు చూస్తున్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎవరు పర్యవేక్షిస్తున్నారు? గత కొంత కాలంగా తమిళనాడు వాసులతో పాటు, దేశ ప్రజలందరికీ కలుగుతున్న సందేహం ఇది. ఈ సందేహానికి సమాధానం తిరువనంతపురానికి చెందిన 1976 ఐఏఎస్ అధికారి షీలా బాలకృష్ణన్(62). ఈమె కనుసన్నల్లోనే పరిపాలన జరుగుతోందని విశ్వసనీయవర్గాల సమాచారం. మంత్రులు, ఉన్నతాధికారులు సైతం ఆమె మార్గదర్శ కత్వంలో పని చేస్తున్నారు. తన పేరును ఎవరికీ తెలియనీయొద్దని షీలా చాలా స్పష్టంగా అందరికీ ఆదేశాలు జారీ చేశారని సమాచారం. సెక్రటేరియట్ లోనే జయ కార్యాలయానికి పక్కనే ఒక చిన్న గదీలోంచి ఆమె మానిటరింగ్ చేస్తున్నారు. డీఎంకే అధికారంలోకి ఉన్నప్పుడు షీలా పక్కన పెట్టారు. జయలలిత అధికారంలోకి రాగానే ఆమెను పర్సనల్ అడ్వైజర్ గా నియమించారు. -
సీల్డ్ కవర్ లో సీఎం పేరు
బెంగళూరు: తమిళ రాజకీయాలకు కర్ణాటక కేంద్ర బిందువుగా మారింది. బెంగళూరు నగర శివారులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అన్నాడీఎంకే అధినేత్రి జె.జయలలితతో తమిళనాడు ప్రభుత్వ పెద్దలు చర్చలు జరుపుతున్నారు. తన తర్వాత ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని కూర్చోపెట్టాలనే దానిపై 'అమ్మ' ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. తనను కలిసిన ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ కు సీల్డ్ కవర్ అందించారని, అందులో సీఎం ఎవరనేది పేర్కొన్నారని చెబుతున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు అన్నాడీఎంకే శాసనసభపక్షం సమావేశమవుతోంది. ఈ భేటీ తర్వాత సీఎం అభ్యర్థి పేరు వెల్లడించే అవకాశముంది. ఒకట్రెండు రోజుల్లో కొత్త సీఎం బాధ్యతలు చేపట్టే అవకాశలున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
సీఎం ఎవరు ?
ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పుపై ఉత్కంఠకు శనివారం సాయంత్రం తెరపడింది. జయకు నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారు కావడంతో కాబోయే సీఎం ఎవరో అనే చర్చకు తెరలేచింది. పన్నీరు సెల్వం, షీలా బాలకృష్ణన్‌కు అవకాశాలున్నా యన్న చర్చ మొదలైంది. చెన్నై : అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు పాలుకావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. సీఎం కుర్చీ ఖాళీ కావడంతో ప్రభుత్వంలో సైతం సీను మారిపోగా, కాబోయే సీఎం ఎవరనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో మూడు పేర్లు షికా రు చేస్తున్నాయి. జయకు జైలు శిక్ష పడిన పక్షంలో మళ్లీ ఆమె బయటకు రాగానే సీఎం కుర్చీని అప్పగించే వ్యక్తికే ఇప్పుడు ఆ పదవి వరిస్తుంది. బెంగళూరు ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పేందుకు వారంరోజుల ముందు నుంచే శిక్షపై అమ్మకు అనుమానం వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందు కే ముగ్గురు విశ్వాస పాత్రులను జయ ముందుగానే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారిలో ఇద్దరు మంత్రులు కాగా, మరొకరు మాజీ ఐఏఎస్ అధికారిణి అని అంటున్నారు. ఎంజీఆర్ హయాం నుంచి జయకు అత్యంత విశ్వసనీయపాత్రుడైన ఆర్థిక మంత్రి ఓ పన్నీర్‌సెల్వం, రవాణాశాఖా మంత్రి సెంధిల్ బాలాజీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణన్ పేరును సైతం అమ్మ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే ఉద్యోగ విరమణ పొందిన షీలాకు మంచి పరిపాలనా అనుభవం ఉంది. అంతకంటే ముఖ్యంగా జయకు అత్యంత నమ్మకస్తురాలు. అందుకే రిటైర్మెంటు అయిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా షీలాను జయ తన వద్దనే ఉంచుకున్నారు. ప్రస్తుతం సీఎం పదవి దక్కించుకోవడానికి ఈ ముగ్గురిలో షీలాకే ఎక్కువ అవకాశాలు ఉన్నారుు. అమ్మకు దత్తపుత్రుడిగా పేరొందిన సెంథిల్ బాలాజీ నమ్మకస్తుడైనా వయస్సులో మరీ పిన్నవాడు కావడం అమ్మను ఆలోచింపచేసి ఉండొచ్చు. సహజంగా ఎవరికీ రెండోసారి మంచి అవకాశం ఇచ్చే అలవాటులేని అమ్మ... పన్నీర్‌సెల్వంను పక్కన పెట్టవచ్చు. పార్టీ పరంగా అనుభవజ్ఞుడైన పన్నీర్‌సెల్వంకు పార్టీ, పరిపాలనా పరంగా అనుభవం, ఉన్నత విద్యార్హత కలిగిన షీలా బాలకృష్ణన్‌కు ప్రభుత్వ పగ్గాలు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాజా తీర్పును కలుపుకుంటే జయ రెండుసార్లు జైలుకెళ్లినా సీఎం హోదాలో కటకటాలపాలు కావడం ఇదే మొదటిసారి. ఈ అప్రతిష్ట రాబోయే ఎన్నికల్లో పార్టీ జయాపజయాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. జయకు పడిన శిక్షను రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలు ప్రధానాస్త్రంగా మార్చుకుంటాయి. ప్రతిపక్షాల విమర్శనాస్త్రాలను దీటుగా ఎదుర్కొని పార్టీని అధికారంలో తేవాల్సిన బాధ్యతను కొత్త వ్యక్తి మోయూల్సి ఉంటుంది. ఇటుంటి గడ్డు పరిస్థితుల్లో కాలం చెల్లిపోతున్న ప్రభుత్వం కంటే మళ్లీ అధికార పీఠాన్ని ఎక్కించగలిగే పార్టీ బాధ్యతలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగా పార్టీ నడిపే బాధ్యతలను పన్నీర్‌సెల్వంపై పెట్టి, ప్రభుత్వ పగ్గాలను షీలా బాలకృష్ణన్‌కు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.