జయ లేకున్నా రాష్ట్రాన్నినడిపిస్తోంది ఆమెనే!
ఒకవైపు అమ్మ ఆస్పత్రిలో ఉన్నారు. ఆమె గురించి రాష్ట్రమంతా కలత చెందుతోంది. అయినా, అధికార యంత్రాంగం మాత్రం ఒకవైపు సీఎం జయలలిత గురించి ఆందోళన చెందుతూనే.. మరొకరి ఆదేశాలు, సూచనల కోసం క్యూ కడుతోంది. ఆమెనే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి షీలా బాలకృష్ణన్. తీవ్ర అనారోగ్యంతో తమిళనాడు సీఎం జయలలిత ఆస్పత్రిలో ఉన్న నేపథ్యంలో రాష్ట్రాన్ని నడిపించే బాధ్యత ఆమె తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఉన్నతాధికారులు మాత్రమే కాదు.. మంత్రులు సైతం ఆమె సూచనల ప్రకారమే నడుచుకుంటున్నారు.
2014లో రిటైరైన షీలా బాలాకృష్ణన్ (62) శక్తియుక్తులపై అపార నమ్మకముండటంతోనే ఆమెను సలహాదారుగా జయలలిత నియమించుకున్నారు. ఇప్పుడు ఆమె అనారోగ్యంతో ఉండటంతో ఆమె స్థానంలో పరిపాలన బాధ్యతలను షీలా బాలకృష్ణన్‌నే నిర్వహిస్తున్నారని, ఈ రోజు ఆమె రాష్ట్రంలో అత్యంత కీలక వ్యక్తిగా మారారని, ఆమె సమ్మతి లేకుండా ఏమీ జరగడం లేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. జయలలిత ఆస్పత్రి పాలై దాదాపు పదిరోజులు అవుతోంది. ఆమె లేకున్నా పరిపాలన ఎలా ముందుకు కొనసాగుతుందనే దానిపై పెదవి విప్పడానికి అధికార వర్గాలు కానీ, సీనియర్ మంత్రులు కానీ ఒప్పుకోవడం లేదు. జయలలిత కన్నుసన్నల్లో ఉండే అన్నాడీఎంకే నేతలు కూడా ఈ విషయంలో స్పందించి.. అమ్మ కోపానికి గురికావడం ఇష్టంలేక మిన్నకుండిపోతున్నారు.
జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రిలోని.. ఆమె ఉన్న గది సమీపంలోనే ఓ గదిలో షీలా బాలాకృష్ణన్ ఉంటున్నారు. అదే అంతస్తులో ఆమె పక్క గదిలో శశికళ బస చేశారు. జయలలిత ఆరోగ్యాన్ని వాకబు చేసేందుకు ఆస్పత్రికి వస్తున్న ఉన్నతాధికారులు అదే సమయంలో పరిపాలన విషయంలో షీలా బాలాకృష్ణన్ సూచనలు తీసుకుంటున్నారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన షీలా 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఆమె రిటైరైన తర్వాత తన సలహాదారుగా జయలలిత నియమించుకున్నారు. జయలలితకు అత్యంత విశ్వసనీయురాలైన సలహాదారుగా పేరొందిన షీలా బాలాకృష్ణన్ సలహాల మేరకే తమిళనాడు చీఫ్ సెక్రటరీ పీ రామమోహన్‌రావు, డీజీపీ టీకే రాజేంద్రన్ నడుచుకుంటున్నారు. జయలలిత అందుబాటులో లేకపోవడంతో మొత్తం పరిపాలన అంతా షీలా సూచనలమేరకు జరుగుతోందని అంటున్నారు. కీలక అన్నాడీఎంకే మంత్రులైన పన్నీర్ సెల్వం వంటి వారు కూడా పరిపాలనలో షీలా సూచనల ప్రకారమే నడుచుకుంటున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో పరిపాలన స్తంభించిపోకుండా, ఎలాంటి చిక్కులు రాకుండా ఆమె సమర్థంగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అధికార వర్గాలు అంటున్నాయి.