జయ సన్నిహితురాలి అనూహ్య నిర్ణయం!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు పరిపాలన బాధ్యతలను ఒంటిచేత్తో నడిపించిన షీలా బాలకృష్ణన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జయలలితకు నమ్మకస్తురాలైన అధికారిగా పేరొందిన ఆమె తాజాగా ముఖ్యమంత్రి సలహాదారు పదవికి రాజీనామా చేశారు. నిజానికి షీలా బాలకృష్ణన్ పదవీకాలం మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో పదవి నుంచి తప్పుకోవాలని ఆమెను ప్రభుత్వమే కోరినట్టు విశ్వసనీయవర్గాలు చెప్తున్నాయి. ఇప్పటివరకు ఆమె రాజీనామా గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ సన్నిహితులతో మాత్రం తాను రాజీనామా చేస్తున్నట్టు ఆమె పేర్కొన్నట్టు మీడియా కథనాలు వస్తున్నాయి.
ప్రస్తుతం తమిళనాడులో ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, శశికళ ఆధిపత్యం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జయలలిత హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శులుగా పనిచేసిన ఇద్దరు అధికారులు కేఎన్ వెంకటరామన్, ఏ రామలింగంలను ముఖ్యమంత్రి కార్యాలయం తొలగించింది. ఈ నేపథ్యంలోనే షీలా బాలకృష్ణన్‌ను తప్పిస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరికొంతమంది కీలక అధికారులను అటు-ఇటు మార్చవచ్చునని వినిపిస్తోంది.
2014లో రిటైరైన షీలా బాలాకృష్ణన్ (62) శక్తియుక్తులపై అపార నమ్మకముండటంతోనే ఆమెను తన సలహాదారుగా జయలలిత నియమించుకున్నారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన షీలా 1976 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. జయలలిత అనారోగ్యంతో ఉన్నప్పుడు 75 రోజుల పాటు పరిపాలన బాధ్యతలను షీలా బాలకృష్ణన్‌నే నిర్వహించారు. జయలలిత మృతి తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమెకు ప్రస్తుతం ప్రాధాన్యం తగ్గిందని, ఈ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసినట్టు వినిపిస్తోంది.