అమ్మపై ఆగ్రహం | Political parties serious on cm | Sakshi
Sakshi News home page

అమ్మపై ఆగ్రహం

Published Sun, Aug 16 2015 4:31 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM

అమ్మపై ఆగ్రహం - Sakshi

అమ్మపై ఆగ్రహం

ముఖ్యమంత్రి జయలలిత స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల్ని ఆమె నిరాశకు గురి చేశారని మండి పడుతున్నారు. ఇక సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నట్టు ఆయా రాజకీయ పక్షాలు ప్రకటించాయి. గాంధేయవాది శశిపెరుమాళ్ కుటుంబీకులు ఆయన సమాధి వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు.
 
- ఉద్యమం ఉధృతం
- సీఎం తీరుపై శివాలు
- శశిపెరుమాళ్ కుటుంబం దీక్ష
సాక్షి, చెన్నై :
రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం నినాదంతో ఆయా పార్టీలు ఉద్యమిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. టాస్మాక్ మద్యం దుకాణాలపై రోజురోజుకు దాడులు పెరుగుతూ వస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే మినహా రాష్ట్రంలోని ప్రతి పక్షాలన్నీ మద్యానికి వ్యతిరేకంగానే ఉద్యమంలో దూసుకెళుతున్నాయి. డీఎంకే సైతం మద్య నిషేధ గళాన్ని అందుకోవడంతో ఇక అన్నాడీఎంకే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఎదురు చూపులు రాష్ట్ర ప్రజల్లో నెలకొంది.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తన ప్రసంగం ద్వారా మద్య నిషేధంపై సీఎం జయలలిత ఏదేని ప్రకటన చేస్తారన్న ఆశ ప్రజల్లో నెలకొంది. అయితే, వారి ఆశలు అడియాశలు చేస్తూ సీఎం జయలలిత ప్రసంగం సాగడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మద్య నిషేధంపై కనీసం చిన్న వ్యాఖ్య కూడా చేయకుండా, తమ ప్రభుత్వ ప్రగతి పురాణంతో ప్రసంగాన్ని సరి పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. సీఎం జయలలిత ఎలాంటి వ్యాఖ్యలు చేయని దృష్ట్యా, ఇక ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు సిద్ధం అయ్యాయి.
 
ఆగ్రహం : సీఎం జయలలిత ప్రసంగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయా పార్టీల నాయకులు వేర్వేరుగా మీడియా సమావేశాల్లో మాట్లాడారు. ఆమె ప్రసంగాన్ని తీవ్రంగా ఖండించారు. పీఎంకే అధినేత రాందాసు పేర్కొంటూ, స్వాతంత్య్ర దినోత్సవం వేళ మద్యానికి వ్యతిరేకంగా సీఎం జయలలిత ప్రకటన చేస్తారని ఎదురు చూసిన ప్రజలకు నిరాశ తప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ అన్ని దరి చేర్చడం లక్ష్యంగా పేర్కొంటూ, ప్రజల జీవితాల్లోని సంతోషాన్ని మద్యం రక్కసి రూపంలో లాగేసుకుంటున్నారని మండి పడ్డారు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ స్పందిస్తూ, మద్యం ప్రజలు ఉద్యమిస్తుంటే, దానిపై నిర్ణయం తీసుకోకుండా, స్వాతంత్య్ర సమరయోధులకు మొక్కుబడిగా పెన్షన్ మొత్తాన్ని పెంచి దాట వేత ధోరణి అనుసరించడాన్ని ఖండిస్తున్నామన్నారు.

సీఎం నోట ఎలాంటి పలుకు రాని దృష్ట్యా, ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నామని, ఎదురయ్యే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ,  పేదల అభ్యున్నతి, సంక్షేమం లక్ష్యంగా వ్యాఖ్యలుచేసిన సీఎం జయలలిత, అదే ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న మద్యం రక్కసిపై ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు.  ఇక, తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్, సీపీఎం, సీపీఐ నేతలు నల్లకన్ను, టీకే రంగరాజన్, ఐజేకే నేత పచ్చముత్తు సైతం సీఎం ప్రసంగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక డీఎండీకే నేత విజయకాంత్ ఓ ప్రకటన విడుదల చేస్తూ సీఎం ప్రసంగంపై శివాలెత్తారు.

అసెంబ్లీలో 110 నిబంధనల మేరకు ప్రకటనల్ని విడుదల చేసినట్టుగా, సీఎం జయలలిత స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగ పురాణం సాగిందని విమర్శించారు. మద్యం నిషేధం లక్ష్యంగా డీఎండీకే పోరు బాటు మరింత ఉధృతం కాబోతున్నదన్నారు. కాగా, ప్రతి పక్షాల ప్రకటనలు, ప్రజా సంఘాల ఆగ్రహంతో టాస్మాక్ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందిలో ఆందోళన బయలు దేరింది. టాస్మాక్ దుకాణాలపై దాడులు జరగకుండా, తమకు భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో టాస్మాక్‌లకు గట్టి భద్రత కల్పించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది.
 
నిరాహార దీక్ష :  స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం పురస్కరించుకుని శశి పెరుమాళ్ కుటుంబీకులు సంపూర్ణ మద్య నిషేధం నినాదంతో ఆయన సమాధి వద్ద నిరాహార  దీక్ష చేశారు.  ఆయన ఆత్మకు శాంతి క ల్గే రీతిలో మద్య నిషేధం అమలు చేయాలని శశిపెరుమాళ్ కుటుంబీకులు వారం రోజులకు పైగా నిరాహార దీక్ష చేశారు. ప్రతి పక్షాల ఒత్తిడితో దీక్ష విరమించి, తాము సైతం అంటూ ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. ఈ నేపథ్యంలో  ఉదయం సేలం జిల్లా ఇలం పిల్లై సమీపంలోని ఈమెట్టు కాడు గ్రామంలో ఉన్న శశిపెరుమాళ్ సమాధి వద్ద  ఒక రోజు నిరాహార దీక్ష నిర్వహించారు. రాష్ర్ట ప్రభుత్వం మద్య నిషేధంపై ప్రకటన చేయక పోవడాన్ని శశిపెరుమాళ్ కుటుం బీకులు తీవ్రంగా ఖండించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement