ఢిల్లీలో రెడ్ అలర్ట్ ప్రకటించరా?
న్యూఢిల్లీ: దీపావళి పండుగ తర్వాత ఢిల్లీ నగరంలో కాలుష్యం పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. గాలిలో ప్రామాణికంగా ఉండాల్సిన పీఎం–2.5 స్థాయి ఢిల్లీలో ఏకంగా బుధవారం నాడు 17 రెట్లు పెరిగిపోయింది. విమానాశ్రయంలో విజిబిలిటీ 300 నుంచి 500 వరకే పరిమితమైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం ఢిల్లీలో కాలుష్యం స్థాయి 494కు చేరుకుంది. చైనాలోని బీజింగ్ నగరంలో ఇటీవల ఎయిర్ కాలుష్యం 300కు చేరుకున్నందుకే నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించి రెండు వారాలపాటు పాఠశాలలను మూసివేశారు. ఫ్యాక్టరీలను మూసేయించారు. రోడ్డపైకి కార్లను అనుమతించలేదు. చాలా మంది పౌరులు ఇళ్లకే పరిమితమయ్యారు.
బీజింగ్ కన్నా కాలుష్యం ఎక్కువైనా ఢిల్లీ నగరంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. పాఠశాలలు, ఫ్యాక్టరీలు యథావిధిగా పనిచేశాయి. కార్లు, ఇతర వాహనాలు తిరిగాయి. కాలి నడకన వెళ్లేవారు వెళ్లారు. వచ్చేవారు వచ్చారు. డెసెంబర్, జనవరి నెలలో తెల్లవారుజామున మంచు కురుస్తుంటే ఎలా మబ్బుగా ఉంటుందో బుధవారం రోజంతా నగరం అలాగే కనిపించింది. దీంతో దీపావళి తర్వాత నగరంలోని వివిధ ప్రాంతాల వాతావరణం పరిస్థితి ఇదంటూ పలువురు ఫొటోలు తీసి ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసుకున్నారు. ముంబై, పుణె నగరాల్లో పరిస్థితి ఇలాగే ఉందని వాతావరణ నిపుణులు తెలియజేశారు.
వాతావరణ కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా ఆరు లక్షల మంది పిల్లలు మరణిస్తున్నారని యూనిసెఫ్ ఇటీవలనే వెల్లడించింది. కాలుష్యం వల్ల గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి. అస్తమా ఉన్నవాళ్లకు మరీ కష్టం. పీఎం 2.5 అంటే పార్టికల్ మ్యాటర్ వ్యాసం 2.5 అని అర్థం. మరో రకంగా చెప్పాలంటే 2.5 వ్యాసం మించని చిన్న కాలుష్య రేణువులు. మన వెంట్రుకలో మూడోవంత సన్నగా ఉంటాయి. ఇవి రోజుకు ఒక్క క్యూబిక్ మీటర్ గాలిలో 35 మైక్రోగ్రాములు మించరాదన్నది ప్రామాణికం.