వెల్లడించిన బిగ్‌బి అమితాబ్
డ్రైవింగ్ లెసైన్స్ ప్రక్రియపై నిరసన
రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి
ముంబై: రోడ్డు ప్రమాదాల నివారణలో రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బిగ్‌బి అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. ఠాణే ట్రాఫిక్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల విషయంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం తనకు అన్నీ ఇచ్చిందని, రోడ్డు ప్రమాదాలను నివారణ కోసం ప్రచారం కల్పించేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. దేశంలో డ్రైవింగ్ లెసైన్స్ ఇచ్చే ప్రక్రియపై నిరసన వ్యక్తం చేశారు. లెసైన్స్ ఇచ్చేముందు అన్ని విధాలుగా పరీక్షించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, జారీ చేసేముందు అన్ని పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. విదేశాల్లో లెసైన్స్‌లు సులభంగా లభించవ న్నారు.
తాను ఓ సారి అమెరికాలో లెసైన్స్ కోసం సంబంధిత అధికారులను సంప్రదించానని, డ్రైవింగ్ లెసైన్స్ ఇవ్వడానికి ఏడు నెలల సమయం పడుతుందన్నారు. టెస్ట్ డ్రైవ్‌ను పరిశీలించి లెసైన్స్ ఇస్తారని పేర్కొన్నారు. మరోవైపు మనదేశంలో వెంటనే లెసైన్స్ లభిస్తోందని, ఇలాంటి నేపథ్యంలో ప్రజలు నియమాలను ఉల్లంఘించొద్దని చెప్పారు. తాను కారు నడిపే సమయంలో అన్ని నియమాలు పాటిస్తానని అమితాబ్ గర్వంగా చెప్పారు.
రోడ్డు భద్రతపై ప్రచారానికి సిద్ధం
Published Sun, Mar 1 2015 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 10:05 PM
Advertisement