Prevention of road traffic accidents
-
కకావికలం
రవాణా కార్మికుల బంద్‌తో జనజీవనం అస్తవ్యస్తం బస్సులు లేక ప్రయాణికులకు ఇక్కట్లు పలు ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సులపై దాడి బెంగళూరు : రోడ్డు ప్రమాదాల నివారణకు గాను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రోడ్డు రవాణా సురక్షతా ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ రవాణా రంగంలోని ఉద్యోగులు, కార్మికులు గురువారం తలపెట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కేఎస్ఆర్టీసీ బస్‌లు డిపోలకే పరిమితం కాగా, బెంగళూరు నగరంలో సైతం బీఎంటీసీ బస్‌లు నిలిచిపోయాయి. బస్‌లన్నీ డిపోలకే పరిమితం కావడంతో టికెట్ కౌంటర్లన్నీ ఖాళీగా కనిపించాయి. రవాణా బంద్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యాననగరిలో ఆటోరిక్షాల డ్రైవర్లు సైతం బంద్‌లో పాల్గొనడంతో ఐటీ, గార్మెంట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ట్యాక్సీలను ఆశ్రయించక తప్పలేదు. ఇక ఈ బంద్‌లో అపశృతులు సైతం చోటుచేసుకున్నాయి. రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 75 బస్‌లపై ఆందోళన కారులు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది డ్రైవర్లు గాయాలపాలు కాగా, బస్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బీఎంటీసీ, కేఎస్ఆర్టీసీకి చెందిన దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఈ బంద్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని చిక్కబళ్లాపుర, మండ్య, బెళగావి, మంగళూరు, గదగ్, హుబ్లీ-ధార్వాడ, మైసూరు తదితర ప్రాంతాలన్నింటిలో బస్‌లు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక ఇదే అదునుగా చేసుకొని ప్రైవేటు బస్‌ల యాజమాన్యాలు ప్రయాణికుల నుంచి ఎక్కువ చార్జీలను దండుకున్నాయి. బంద్ సందర్భంగా నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. నగర అదనపు పోలీస్ కమిషనర్ అలోక్‌కుమార్ నగరంలోని వివిధ బీఎంటీసీ డిపోలను సందర్శించారు. ఈ సందర్భంగా అలోక్‌కుమార్ మాట్లాడుతూ బలవంతంగా బంద్‌లో పాల్గొనాల్సిందిగా ఒత్తిడి తెచ్చే వారిపై కఠిన చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. బంద్ సందర్భంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాక కామాక్షిపాళ్య ప్రాంతంలో ఓ ఆటోలో కూర్చొని తిరుగుతూ బస్‌ల పై రాళ్లదాడికి దిగిన ఇద్దరు ఆటో డ్రైవర్లను సైతం అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక గురువారం సాయంత్రం 5 గంటల నుంచి బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బస్‌ల సంచారం ప్రారంభమైంది. -
రోడ్డు భద్రతపై ప్రచారానికి సిద్ధం
వెల్లడించిన బిగ్‌బి అమితాబ్ డ్రైవింగ్ లెసైన్స్ ప్రక్రియపై నిరసన రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి ముంబై: రోడ్డు ప్రమాదాల నివారణలో రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బిగ్‌బి అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. ఠాణే ట్రాఫిక్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాల విషయంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం తనకు అన్నీ ఇచ్చిందని, రోడ్డు ప్రమాదాలను నివారణ కోసం ప్రచారం కల్పించేందుకు తాను సిద్ధమేనని తెలిపారు. దేశంలో డ్రైవింగ్ లెసైన్స్ ఇచ్చే ప్రక్రియపై నిరసన వ్యక్తం చేశారు. లెసైన్స్ ఇచ్చేముందు అన్ని విధాలుగా పరీక్షించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, జారీ చేసేముందు అన్ని పరీక్షలు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. విదేశాల్లో లెసైన్స్‌లు సులభంగా లభించవ న్నారు. తాను ఓ సారి అమెరికాలో లెసైన్స్ కోసం సంబంధిత అధికారులను సంప్రదించానని, డ్రైవింగ్ లెసైన్స్ ఇవ్వడానికి ఏడు నెలల సమయం పడుతుందన్నారు. టెస్ట్ డ్రైవ్‌ను పరిశీలించి లెసైన్స్ ఇస్తారని పేర్కొన్నారు. మరోవైపు మనదేశంలో వెంటనే లెసైన్స్ లభిస్తోందని, ఇలాంటి నేపథ్యంలో ప్రజలు నియమాలను ఉల్లంఘించొద్దని చెప్పారు. తాను కారు నడిపే సమయంలో అన్ని నియమాలు పాటిస్తానని అమితాబ్ గర్వంగా చెప్పారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు : ఎస్పీ తరుణ్‌జోషి
ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ తరుణ్‌జోషి సూచించారు. సోమవారం స్థానిక పోలీసు క్యాంపు కార్యాలయంలో ఆర్టీవో, ఆర్టీసీ ప్రత్యేక విజిలెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముందస్తు చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల స్థలాలను గుర్తించి హెచ్చరికలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని, మూలమలుపు ప్రదేశాల్లో సిగ్నల్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ వారం జాతీయ రహదారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాలు తనిఖీ చేయాలన్నారు. ఆటోల్లో ఎటువంటి సరుకులు రవాణా చేయకూడదని, వాహనాలకు ముందు, వెనకాల రిజిస్ట్రేషన్ నెంబర్లు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థుల తరలించే విషయంలో ఎటువంటి రాజీలేకుండా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. రవాణా ఉప కమిషనర్ రాజారత్నం, ఆర్టీవో భద్రునాయక్, ఆర్టీసీ ఆర్ఎం వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.