ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ తరుణ్‌జోషి సూచించారు. సోమవారం స్థానిక పోలీసు క్యాంపు కార్యాలయంలో ఆర్టీవో, ఆర్టీసీ ప్రత్యేక విజిలెన్స్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముందస్తు చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు.
జిల్లా వ్యాప్తంగా గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల స్థలాలను గుర్తించి హెచ్చరికలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని, మూలమలుపు ప్రదేశాల్లో సిగ్నల్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతీ వారం జాతీయ రహదారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాహనాలు తనిఖీ చేయాలన్నారు.
ఆటోల్లో ఎటువంటి సరుకులు రవాణా చేయకూడదని, వాహనాలకు ముందు, వెనకాల రిజిస్ట్రేషన్ నెంబర్లు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థుల తరలించే విషయంలో ఎటువంటి రాజీలేకుండా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. రవాణా ఉప కమిషనర్ రాజారత్నం, ఆర్టీవో భద్రునాయక్, ఆర్టీసీ ఆర్‌ఎం వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు : ఎస్పీ తరుణ్‌జోషి
Published Tue, Dec 23 2014 1:32 AM | Last Updated on Sun, Apr 7 2019 3:23 PM
Advertisement