కకావికలం | Transport workers' strike | Sakshi
Sakshi News home page

కకావికలం

Published Fri, May 1 2015 2:04 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

కకావికలం

కకావికలం

రవాణా కార్మికుల బంద్‌తో జనజీవనం అస్తవ్యస్తం
బస్సులు లేక ప్రయాణికులకు ఇక్కట్లు
పలు ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సులపై దాడి

 
బెంగళూరు : రోడ్డు ప్రమాదాల నివారణకు గాను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రోడ్డు రవాణా సురక్షతా ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ రవాణా రంగంలోని ఉద్యోగులు, కార్మికులు గురువారం తలపెట్టిన బంద్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కేఎస్‌ఆర్‌టీసీ బస్‌లు డిపోలకే పరిమితం కాగా, బెంగళూరు నగరంలో సైతం బీఎంటీసీ బస్‌లు నిలిచిపోయాయి. బస్‌లన్నీ డిపోలకే పరిమితం కావడంతో టికెట్ కౌంటర్లన్నీ ఖాళీగా కనిపించాయి. రవాణా బంద్ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉద్యాననగరిలో ఆటోరిక్షాల డ్రైవర్‌లు సైతం బంద్‌లో పాల్గొనడంతో ఐటీ, గార్మెంట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ట్యాక్సీలను ఆశ్రయించక తప్పలేదు. ఇక ఈ బంద్‌లో అపశృతులు సైతం చోటుచేసుకున్నాయి.

రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు 75 బస్‌లపై ఆందోళన కారులు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో కొంతమంది డ్రైవర్లు గాయాలపాలు కాగా, బస్‌లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బీఎంటీసీ, కేఎస్‌ఆర్‌టీసీకి చెందిన దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఈ బంద్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని చిక్కబళ్లాపుర, మండ్య, బెళగావి, మంగళూరు, గదగ్, హుబ్లీ-ధార్వాడ, మైసూరు తదితర ప్రాంతాలన్నింటిలో బస్‌లు డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక ఇదే అదునుగా చేసుకొని ప్రైవేటు బస్‌ల యాజమాన్యాలు ప్రయాణికుల నుంచి ఎక్కువ చార్జీలను దండుకున్నాయి. బంద్ సందర్భంగా నగరంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకుంది.

నగర అదనపు పోలీస్ కమిషనర్ అలోక్‌కుమార్ నగరంలోని వివిధ బీఎంటీసీ డిపోలను సందర్శించారు. ఈ సందర్భంగా అలోక్‌కుమార్ మాట్లాడుతూ బలవంతంగా బంద్‌లో పాల్గొనాల్సిందిగా ఒత్తిడి తెచ్చే వారిపై కఠిన చర్యలకు ఆదేశించినట్లు తెలిపారు. బంద్ సందర్భంగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 50 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అంతేకాక కామాక్షిపాళ్య ప్రాంతంలో ఓ ఆటోలో కూర్చొని తిరుగుతూ బస్‌ల పై రాళ్లదాడికి దిగిన ఇద్దరు ఆటో డ్రైవర్‌లను సైతం అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక గురువారం సాయంత్రం 5 గంటల నుంచి బెంగళూరుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బస్‌ల సంచారం ప్రారంభమైంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement