అమ్మ ఫొటో లేదని అలిగిన మంత్రి
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలిత ఫొటో లేదని ఆమె మంత్రివర్గంలోని ఓ మంత్రి గారు తీవ్రంగా కలత చెందారు. దీంతో ఎగ్జిబిషన్ స్టాల్ ప్రారంభించకుండానే... వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. తిరుచ్చి వెస్ట్రి పాఠశాల మైదానంలో వినోదకరమైన పలు అంశాలతో ప్రభుత్వ ప్రదర్శన శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సమాచార, ప్రత్యేక కార్యక్రమాల అమలు శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ హాజరయ్యారు.
ఆయన ఎగ్జిబిషన్లోని పలు స్టాల్స్ను ప్రారంభించారు. అయితే ఆ పక్కనే ఉన్న ఆర్బీఐ స్టాల్ను ప్రారంభించేందుకు వెళ్లారు. ఇంతలో ఏమైందో ఏమో ఆయన ఆ స్టాల్ను ప్రారంభించకుండానే వెళ్లిపోయారు. దాంతో జిల్లా కలెక్టర్తో ఈ స్టాల్ను ప్రారంభించారు. దీనిపై ఆర్బీఐ అధికారులను వివరణ కోరగా... ఎగ్జిబిషన్లోని అన్ని స్టాల్స్లో అమ్మ జయలలిత పొటో ఏర్పాటైందని... కానీ రిజర్వు బ్యాంకు స్టాల్లో ఆమె ఫొటో ఏర్పాటు చేయలేదన్నారు.
దీన్ని గమనించి జిల్లా పార్టీ నిర్వాహకులు రిజర్వు బ్యాంకు స్టాల్లో ముఖ్యమంత్రి జయలలిత ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారని చెప్పారు. కానీ ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని... దీనికి రాజకీయ రంగు పులమడం సరికాదని చెప్పినట్లు తెలిపారు. అందువల్లే తమ స్టాల్ను మంత్రి రాజేంద్ర బాలాజీ ప్రారంభించకుండా వెళ్లారని ఆర్బీఐ అధికారులు చెప్పారు.