Rajendra balaji
-
నేను అలా చెప్పలేదు..!
టీ.నగర్: జయలలిత డిసెంబరు నాలుగో తేదీ మృతిచెందినట్లు తాను చెప్పలేదని, ఆమె గుండె పనిచేయడం లేదని మాత్రమే చెప్పానని మంత్రి రాజేంద్ర బాలాజీ ప్లేటు ఫిరాయించారు. శివకాశిలో ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో మంత్రి రాజేంద్ర బాలాజీ మాట్లాడుతూ, పేద, సామాన్య ప్రజల ప్రభుత్వంగా అన్నాడీఎం కే పాలన కొనసాగుతోందని, ఎంజీఆర్, జయలలిత అహర్నిశలూ పాటుపడి సంరక్షించిన అన్నాడీఎంకే పార్టీని ఎవరూ నాశనం చేయలేరన్నారు. ఎంజీఆర్ ప్రారంభించిన పార్టీ, ఆయన ప్రవేశపెట్టిన చిహ్నం రెండాకుల గుర్తుపై తాను ఐదుసార్లు పోటీ చేసి గెలు పొందానన్నారు. నాల్గవ తేదీ హార్ట్‌అటాక్‌కు గురికాగా, ఐదో తేదీన జయలలిత మృతిచెందారన్నారు. జయలలిత ప్రజల మనస్సుల్లో జీవిస్తున్నట్లు తెలిపారు. జాతీయ పార్టీలకు నోటాతో పోటీ–తంబిదురై : జాతీయ పార్టీలు నోటాతో పోటీపడాల్సి ఉంటుందని పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై వ్యాఖ్యానించారు. కరూరు 80 అడుగుల రోడ్డులో జిల్లా అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ఎంజీఆర్ 101 జయంతి వేడుక శనివారం రాత్రి జరిగింది. ఇందులో నగర కార్యదర్శి నెడుంజెళియన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తంబిదురై జాతీయ పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలు ఇకపై నోటాతోనే పోటీపడాలని ఎద్దేవా చేశారు. -
బీజేపీతో పొత్తుపై భిన్నాభిప్రాయాలు
సాక్షి, టీ.నగర్: అన్నాడీఎంకే, బీజేపీ సంబంధాలపై మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం అన్నాడీఎంకే వర్గాల్లో కలకలానికి దారితీసింది. భారతీయ జనతా పార్టీతో జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడీఎంకే 1998లో పొత్తు కుదుర్చుకుని గెలుపొందింది. అయితే కొన్ని నెలల్లోనే బీజేపీ కూటమి నుంచి జయలలిత వైదొలగారు. ఆ తర్వాత అన్నాడీఎంకే, బీజేపీ కూటమి ఏర్పడలేదు. జయలలిత 2001, 2011, 2016లో గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకున్న స్థితిలో బీజేపీ నేతలతో సుముఖంగా వ్యవహరిస్తూ వచ్చారు. సుమారు 20 ఏళ్లుగా ఆమె నాయకత్వంలోని అన్నాడీఎంకే బీజేపీతో కూటమి ఏర్పాటు చేసుకోలేదు. 2014లో కేంద్రంలో గెలుపొంది ప్రధాని పదవి చేపట్టిన నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వర్గంలో అన్నాడీఎంకేకు ముఖ్య స్థానం కల్పిస్తానని తెలిపినప్పటికీ పొత్తుకు జయలలిత అంగీకరించలేదు. అయితే జయలలిత మృతి తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అన్నాడీఎంకే సన్నిహిత సంబంధాలు అధికమయ్యాయి. అన్నాడీఎంకేలో చీలిక, అభిప్రాయభేదాలు ఏర్పడిన స్థితిలో ప్రధాని మోదీ చలవతో ఎడపాడి పళనిస్వామి, ఓ.పన్నీర్‌సెల్వం మధ్య విభేదాలు తొలగిపోయాయి. అభిప్రాయభేదాలు: బీజేపీతో కూటమిపై అన్నాడీఎంకే సీనియర్ నేతల మధ్య ఇప్పుడే అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. అన్నాడీఎంకేలో ఒక వర్గం బీజేపీ పొత్తుతోనే గట్టెక్కగలమని భావిస్తున్నారు. అయితే మరో వర్గం ఈ వ్యవహారంలో జయలలిత ఎటువంటి వైఖరి అవలంభించారో దాన్నే కొనసాగించాలంటున్నారు. సహకారశాఖ మంత్రి సెల్లూర్రాజు దీనిగురించి మాట్లాడుతూ.. బీజేపీతో ఎలాంటి సంబంధాలు ఉండరాదని జయలలిత ఇదివరకే గట్టి నిర్ణయం తీసుకున్నారని, బీజేపీ మతతత్వ పార్టీ అయినందున ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీన్నే తాము అనుసరించాలనుకుంటున్నట్టు తెలిపారు. మంత్రి రాజేంద్రబాలాజీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే ఓటమికి బీజేపీతో సయోధ్యే కారణమని చెప్పలేమని, ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. వైఫల్యం అనేది యాక్సిడెంటల్ అని, అది విజయానికి మెట్టుగా మారవచ్చన్నారు. అందువల్ల బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం తప్పుకాదన్నారు. బీజేపీతో కూటమి గురించి మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం అన్నాడీఎంకే వర్గాల్లో గందరగోళం సృష్టించింది. -
మోదీ ఉన్నాడు... రెండాకుల గుర్తు మాదే
సాక్షి, చెన్నై : వివాదంలో ఉన్న రెండాకుల గుర్తు తమకే వస్తుందనే విశ్వాసాన్ని తమిళనాడు మంత్రి కేటీ రాజేంద్ర శనివారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గానికి చెందిన రాజేంద్ర.. శనివారం ఆండిపట్టిలో పార్టీ సమావేశంలో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ తమ వెంటే ఉన్నారని.. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకేను ప్రతిపక్ష డీఎంకే సహా ఎవ్వరూ ఏమీ చేయలేరని రాజేంద్ర పేర్కొన్నారు. ఎన్నికల సంఘం దగ్గరున్న రెండాకుల గుర్తు ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గానికే లభిస్తుందని ఇందులో ఎవరూ ఎటువంటి సందేహాన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుత అధికార అన్నాడీఎంకే వెంట 92 శాతం మంది శాసనసభ సభ్యుల మద్దతు ఉందని ప్రకటించారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే పార్టీ పన్నీర్‌సెల్వం, శశికళ వర్గాలుగా చీలిపోయింది. అదే సమయంలో ఆర్కే నగర్ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో పార్టీ గుర్తును ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిషేధించింది. ప్రస్తుతం పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గాలు రెండు కలిసిపోవడంతో రెండాకుల గుర్తుపై ఇర ఎటువంటి సమస్య లేదని ఆయన అన్నారు. -
ఉరికైనా సిద్ధం
►రాజీనామాకు ఒత్తిడి ►మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ►పాలల్లో ఫార్మా డిలైట్ గుర్తింపు ►సిట్టింగ్ జడ్జి విచారణకు స్టాలిన్ డిమాండ్ సాక్షి, చెన్నై : ప్రైవేటు పాలలో రసాయనాలు లేవు అని నిరూపిస్తే, ఉరి కంభంలో వేలాడేందుకైనా తాను సిద్ధం అని పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ స్పష్టం చేశారు. పాలల్లో పలు మిశ్రమాలతో కూడిన ఫార్మా డిలైట్ అన్న రసాయనాన్ని గుర్తించామన్నారు. ప్రైవేటు పాలల్లో రసాయనాలు కలుపుతున్నట్టుగా మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను ప్రైవేటు సంస్థలు ఖండిస్తున్నాయి. ప్రైవేటు పాల వ్యాపారం దెబ్బ తినే ప్రమాదంతో ఏజెంట్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డీఎండీకే అధినేత విజయకాంత్ లాంటి వాళ్లు ఒకరిద్దరు మంత్రి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. మరి కొందరు ఇన్నాళ్లు ఎందుకు మౌనం వహించారోనని ప్రశ్నిస్తున్నారు. ఇక, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ అయితే, తాజా పరిణామాలు, వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణించారు. గతంలో ప్రభుత్వ రంగం సంస్థ ఆవిన్‌లో సాగిన అవినీతి మాయాజాలాన్ని గుర్తు చేస్తూ, ఆ విచారణ ఏమైనట్టో ప్రశ్నించారు. ప్రైవేటు పాల విషయంగా సాగుతున్న మిక్సింగ్ గురించి మంత్రి ఆలస్యంగానైనా నోరు మెదిపి ఉండడం అనుమానాలకు దారి తీస్తున్నాయని శనివారం తూత్తుకుడిలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో శివకాశిలో మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్ వ్యాఖ్యలను మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ఆహ్వానించడం గమనార్హం. ఉరికి సిద్ధం : రసాయనాల వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని స్టాలిన్ డిమాండ్ చేయడాన్ని తాను ఆహ్వానిస్తున్నానని ప్రకటించారు. ప్రైవేటు పాలలో రసాయనాలు ఉన్న విషయం నిర్ధారణ అయిందన్నారు. గిండి, మాధవరంలలోని ప్రభుత్వ పరిశోధనా కేంద్రంలో సాగిన పరిశీలనలో కొన్ని రకాల మిశ్రమాలతో ఫార్మా డిలైట్ అన్న రసాయనాన్ని గుర్తించడం జరిగిందన్నారు. మైసూర్‌లోని కేంద్ర ప్రభుత్వ పరిశోధనా కేంద్రానికి సైతం శాంపిల్స్ పంపించామని, అక్కడి నుంచి నివేదిక రాగానే, ప్రైవేటు పాల సంస్థల భరతం పట్టే విధంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. విజయకాంత్ లాంటి వాళ్లు ప్రైవేటు పాల సంస్థలకు మద్దతుగా వ్యాఖ్యానిస్తుండడం, మరి కొందరు అయితే, తనను పదవికి రాజీనామా చేయించే విధంగా ఒత్తిడికి దిగడం శోచనీయమని విమర్శించారు. తాను ఎన్నడూ ప్రైవేటు పాల సంస్థల వద్ద చేతులు చాచ లేదని, అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రైవేటు పాలలో రసాయనాలు లేవు అని నిరూపిస్తే, పదవికి తానే రాజీనామా చేస్తానని, ఉరి కంబంలో వేలాడేందుకు కూడా సిద్ధం అని స్పష్టం చేశారు. గత ఏడాది ఈ శాఖ మంత్రిగా తాను పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లోనే రసాయనాల వ్యవహారం ఫిర్యాదు రూపంలో చేరిందని, రహస్యంగా విచారించి, నిర్ధారించుకున్న అనంతరం ప్రస్తుతం బయట పెట్టానంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. రాజీనామాకు ఒత్తిడి తెచ్చినా, ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా, ప్రైవేటు పాల రసాయనాల భరతం పట్టే విషయంలో తాను వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
అమ్మ ఫొటో లేదని అలిగిన మంత్రి
చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలిత ఫొటో లేదని ఆమె మంత్రివర్గంలోని ఓ మంత్రి గారు తీవ్రంగా కలత చెందారు. దీంతో ఎగ్జిబిషన్ స్టాల్ ప్రారంభించకుండానే... వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. తిరుచ్చి వెస్ట్రి పాఠశాల మైదానంలో వినోదకరమైన పలు అంశాలతో ప్రభుత్వ ప్రదర్శన శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సమాచార, ప్రత్యేక కార్యక్రమాల అమలు శాఖ మంత్రి రాజేంద్ర బాలాజీ హాజరయ్యారు. ఆయన ఎగ్జిబిషన్‌లోని పలు స్టాల్స్‌ను ప్రారంభించారు. అయితే ఆ పక్కనే ఉన్న ఆర్బీఐ స్టాల్‌ను ప్రారంభించేందుకు వెళ్లారు. ఇంతలో ఏమైందో ఏమో ఆయన ఆ స్టాల్‌ను ప్రారంభించకుండానే వెళ్లిపోయారు. దాంతో జిల్లా కలెక్టర్‌తో ఈ స్టాల్‌ను ప్రారంభించారు. దీనిపై ఆర్బీఐ అధికారులను వివరణ కోరగా... ఎగ్జిబిషన్‌లోని అన్ని స్టాల్స్‌లో అమ్మ జయలలిత పొటో ఏర్పాటైందని... కానీ రిజర్వు బ్యాంకు స్టాల్లో ఆమె ఫొటో ఏర్పాటు చేయలేదన్నారు. దీన్ని గమనించి జిల్లా పార్టీ నిర్వాహకులు రిజర్వు బ్యాంకు స్టాల్లో ముఖ్యమంత్రి జయలలిత ఫొటో పెట్టాలని డిమాండ్ చేశారని చెప్పారు. కానీ ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని... దీనికి రాజకీయ రంగు పులమడం సరికాదని చెప్పినట్లు తెలిపారు. అందువల్లే తమ స్టాల్‌ను మంత్రి రాజేంద్ర బాలాజీ ప్రారంభించకుండా వెళ్లారని ఆర్బీఐ అధికారులు చెప్పారు.