సాక్షి, టీ.నగర్: అన్నాడీఎంకే, బీజేపీ సంబంధాలపై మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం అన్నాడీఎంకే వర్గాల్లో కలకలానికి దారితీసింది. భారతీయ జనతా పార్టీతో జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడీఎంకే 1998లో పొత్తు కుదుర్చుకుని గెలుపొందింది. అయితే కొన్ని నెలల్లోనే బీజేపీ కూటమి నుంచి జయలలిత వైదొలగారు. ఆ తర్వాత అన్నాడీఎంకే, బీజేపీ కూటమి ఏర్పడలేదు. జయలలిత 2001, 2011, 2016లో గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకున్న స్థితిలో బీజేపీ నేతలతో సుముఖంగా వ్యవహరిస్తూ వచ్చారు.
సుమారు 20 ఏళ్లుగా ఆమె నాయకత్వంలోని అన్నాడీఎంకే బీజేపీతో కూటమి ఏర్పాటు చేసుకోలేదు. 2014లో కేంద్రంలో గెలుపొంది ప్రధాని పదవి చేపట్టిన నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వర్గంలో అన్నాడీఎంకేకు ముఖ్య స్థానం కల్పిస్తానని తెలిపినప్పటికీ పొత్తుకు జయలలిత అంగీకరించలేదు. అయితే జయలలిత మృతి తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అన్నాడీఎంకే సన్నిహిత సంబంధాలు అధికమయ్యాయి. అన్నాడీఎంకేలో చీలిక, అభిప్రాయభేదాలు ఏర్పడిన స్థితిలో ప్రధాని మోదీ చలవతో ఎడపాడి పళనిస్వామి, ఓ.పన్నీర్‌సెల్వం మధ్య విభేదాలు తొలగిపోయాయి.
అభిప్రాయభేదాలు:
బీజేపీతో కూటమిపై అన్నాడీఎంకే సీనియర్ నేతల మధ్య ఇప్పుడే అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. అన్నాడీఎంకేలో ఒక వర్గం బీజేపీ పొత్తుతోనే గట్టెక్కగలమని భావిస్తున్నారు. అయితే మరో వర్గం ఈ వ్యవహారంలో జయలలిత ఎటువంటి వైఖరి అవలంభించారో దాన్నే కొనసాగించాలంటున్నారు. సహకారశాఖ మంత్రి సెల్లూర్‌రాజు దీనిగురించి మాట్లాడుతూ.. బీజేపీతో ఎలాంటి సంబంధాలు ఉండరాదని జయలలిత ఇదివరకే గట్టి నిర్ణయం తీసుకున్నారని, బీజేపీ మతతత్వ పార్టీ అయినందున ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
దీన్నే తాము అనుసరించాలనుకుంటున్నట్టు తెలిపారు. మంత్రి రాజేంద్రబాలాజీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే ఓటమికి బీజేపీతో సయోధ్యే కారణమని చెప్పలేమని, ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. వైఫల్యం అనేది యాక్సిడెంటల్ అని, అది విజయానికి మెట్టుగా మారవచ్చన్నారు. అందువల్ల బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం తప్పుకాదన్నారు. బీజేపీతో కూటమి గురించి మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం అన్నాడీఎంకే వర్గాల్లో గందరగోళం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment