సాక్షి, చెన్నై: చిల్లర వర్తకంలోకి విదేశీ పెట్టుబడుల్ని అనుమతించేందుకు కేంద్రం నిర్ణయించడం, ఆహార భద్రతా, నాణ్యత చట్టం అమలుకు చర్యలు తీసుకోవడం వంటి కారణాల నేపథ్యంలో చిల్లర వర్తకులు నిరసన గళం విప్పారు. ఈ రెండు చట్టాల ప్రభావం రాష్ట్రం మీద పడే అవకాశం ఉండటంతో ఆది నుంచి వీటిని ప్రభుత్వం వ్యతిరేకిస్తూ వస్తున్నది. రాష్ట్రంలోని వర్తకులు రోడ్డున పడే ప్రమాదం ఉందని, పౌరసరఫరాల విభాగం నేతృత్వంలో అమల్లో ఉన్న ఉచిత బియ్యం పంపిణీకి గండి పడే ప్రమాదం ఉందని ప్రభుత్వం హెచ్చరిస్తూ వస్తున్నది. వీటిని రాష్ట్రంలోకి అనుమతించే ప్రసక్తేలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ గళానికి వర్తకులు గొంతు కలిపారు. ఆందోళన తో కేంద్రానికి తమ నిరసనను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
పోటెత్తిన వర్తకులు
కేంద్ర ప్రభుత్వ నిర్ణయూలకు వ్యతిరేకంగా నిరసన సభ, రాజ్ భవన్ వైపుగా ర్యాలీకి రాష్ట్ర వర్తక సమాఖ్య పిలుపు నిచ్చింది. దీంతో రాష్ట్రంలోని తిరునల్వేలి, కోయంబత్తూరు, ఈరోడ్, సేలం, విరుదునగర్, తిరుచ్చి, ధర్మపురి, కృష్ణగిరి, మదురై, దిండుగల్ తదితర జిల్లాల నుంచి వేలాదిగా వర్తకులు చెన్నైకు పోటెత్తారు. కొన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వ్యాన్లతో రాల్యీగా, తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై పరిసరాల నుంచి మోటార్ సైకిళ్ల ర్యాలీతో వర్తకులు సైదా పేటకు చేరుకున్నారు. అక్కడి పనగల్ మాళిగై వద్ద గుమికూడారు. ఆ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ రాజా నేతృత్వంలో నిరసన సభనిర్వహించారు. విక్రమ రాజా మాట్లాడుతూ, కేంద్రం తీరును ఎండగట్టారు. చిల్లర వర్తకుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోకి అనుమతించబోమంటూ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నా, బలవంతంగా రుద్దేందుకు కేంద్రం ప్రయత్నాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్రం తన తీరును మార్చుకోకుంటే, వర్తక బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు.
భారీ ర్యాలీ
నిరసన సభ అనంతరం వేలాదిగా రాజ్ భవన్ వైపు ర్యాలీగా బయలు దేరారు. వీరిని మార్గం మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించిన వర్తకులు నినాదాలతో హోరెత్తించారు. తమ పొట్టలు కొట్టొద్దని, తమ కుటుంబాల్ని రోడ్డుపాలు చేయొద్దంటూ నినదించారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుం టూ నాయకులు ముందుకు దూసుకెళ్లడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు శ్రమించా రు. ఈ క్రమంలో వాగ్యుద్ధం, తోపులాట చోటుచేసుకుంది. చివరకు శాంతి భద్రతల దృష్ట్యా, తమకు సహకరించాలని పోలీసులు బుజ్జగించడంతో నేతలు అరెస్టు అయ్యారు. అరెస్టయిన వారందర్నీ ఓ కల్యాణ మండపంలో సాయంత్రం వరకు ఉంచి తర్వాత విడిచి పెట్టారు. ఈ నిరసన కారణంగా సైదా పేట మార్గంలో ట్రాఫి క్ స్తంభించిపోయింది. వాహనాలు బారులు తీరాయి. దీన్ని క్రమబద్ధీకరించడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది.
కదం తొక్కిన వర్తక లోకం
Published Wed, Nov 20 2013 3:09 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement