సుదీర్ఘ చర్చ!
► పలు అంశాలపై సమీక్ష
► రెండు గంటల పాటు కేబినెట్ భేటీ
► మూడో వారంలో బడ్జెట్
ఈ నెల మూడో వారంలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు తగ్గ నిర్ణయాన్ని కేబినెట్ భేటీలో తీసుకున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. రెండు గంటల పాటు కేబినెట్ భేటీ శుక్రవారం సాగడంతో పలు అంశాలపై సుదీర్ఘ చర్చ సాగినట్టు సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి.
సాక్షి, చెన్నై: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే పళనిస్వామి బాధ్యతలు చేపట్టినానంతరం పాలన మీద పట్టు సాధించేందుకు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏర్పడడంతో అందుకు తగ్గ కసరత్తుల్లో పడ్డారు. ఇందుకుగాను శుక్రవారం కేబినెట్ మీటింగ్‌కు పిలుపు నిచ్చారు. సచివాలయంలో సాయంత్రం నాలుగున్నర గంటలకు మంత్రి వర్గం భేటీ అయింది. ముందుగా దివంగత సీఎం జయలలిత చిత్ర పటం వద్ద నివాళులర్పించినానంతరం మంత్రి వర్గ సమావేశం ప్రారంభవైుంది.
రెండు గంటల పాటు పలు అంశాలపై సుదీర్ఘ చర్చతో ఈ సమావేశం సాగినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ దాఖలు, శాఖల వారీగా నిధుల కేటాయింపులు మీద సమీక్షించి ఉన్నారు. ఈనెల మూడో వారం సభలో బడ్జెట్ దాఖలుకు తగ్గ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో తేదీని అసెంబ్లీ కార్యదర్శి మరో రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
ఇక, హైడ్రోకార్బన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా, నీట్ పరీక్షలకు వ్యతిరేకంగా, ఏడోవ వేతన కమిషన్ సిఫారసుల పరిశీలనకు నియమించిన కమిటీ అధికారాలు, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు తదితర అంశాలపై చర్చించి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. అలాగే, కరువు ప్రాంతాల్లో రైతుల్ని ఆదుకునేందుకు తగ్గ చర్యల వేగవంతం, ప్రధాన ప్రతి పక్షాన్ని ఢీకొట్టేందుకు తగ్గ అస్త్రాలపై కూడా చర్చించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇక, రాష్ట్రంలో అప్పులు, నిధుల వనరుల మీద సమీక్షించి ఉన్నారు.