షోలాపూర్, న్యూస్‌లైన్: ‘విద్య అందరికీ అందుబాటులోకి రావాలనే సంకల్పంతో పూర్వీకులు స్థాపించిన పద్మశాలి శిక్షణ సంస్థ నేడు మహా వృక్షంగా ఎదిగి, 22 శాఖలుగా విస్తరించింది. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యనందిస్తున్న సంస్థ నేడు శతాబ్ధి ఉత్సవాలను జరుపుకోవడం, పూర్వీకుల కలలను సాకారం చేయడం, ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా ఉంద’నికేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని మల్లయ్య కొండా క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన పద్మశాలి శిక్షణ సంస్థ శతాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకలకు షిండేఅధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పొట్ట చేతపట్టుకొని తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల నుంచి ఇక్కడికి వలస వచ్చి, శాశ్వతంగా స్థిరపడి అన్ని రంగాలలో రాణిస్తున్న తెలుగువారి ధైర్యసాహసాలు ప్రశంసనీయమ’న్నారు. శాసనకర్తలుగా రాణించిన గంగాధర్ కుచన్, ధర్మన్న సాదుల్, విలాస్‌రావు బేత్, వెంకప్ప మడుర్, నర్సయ్య ఆడంలను పేరుపేరునా ప్రశంసించారు.
తెలుగువారి ఐక్యతకు నిదర్శనం: చిరంజీవి
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పర్యాటకశాఖమంత్రి చిరంజీవి మాట్లాడుతూ.. తెలుగువారు ఇక్కడికి వలస వచ్చి శాశ్వతంగా స్థిరపడి అన్ని రంగాలలో రాణించడం హర్షించాల్సిన విషయంగా పేర్కొన్నారు. కలసికట్టుగా ఉంటూ విద్యాసంస్థను స్థాపించి, వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే సామాన్య విషయం కాదన్నారు. తెలుగువారి ఐక్యత ఈ వేడుకలు నిదర్శనమన్నారు. రాజకీయాలలోకి రాకముందు నుంచి సుశీల్‌కుమార్ షిండేతో ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు. షోలాపూర్, తుల్జాపూర్, అక్కల్‌కోట్, పండరీపూర్‌లను కలిపే మెగాసర్క్యూట్ టూరిజం కోసం రూ.43 కోట్లు విడుదల చేశానని చిరంజీవి ఈ సందర్భంగా చెప్పారు. నేతన్నలంటే తనకు ప్రత్యేక అభిమానమన్నారు. చంటబ్బాయి సినిమాలో తాను వేసిన చార్లి చాప్లిన్ వేషానికి నిలువెత్తు చేనేత చిత్రపటం ఇక్కడి వారే వేసి తనకు అందజేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక్కడి మరమగ్గాలు, బీడీ కార్మకులకు సంబంధించిన సమస్యలన్నీ యూపీఏ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జాల్నా ఎమ్మెల్యే కైలాస్ గోరంట్యాల్, ఎమ్మెల్యే ప్రణతి షిండే, ఎమ్మెల్యే విజయ్ దేశ్‌ముఖ్, ఎమ్మెల్యే, దిలీప్ మానే, మేయర్ అల్కా రాథోడ్ , కాంగ్రెస్ నాయకురాలు ఉజ్వల షిండే, పద్మశాలి సమాజానికి చెందిన వారితోపాటు ఇతర కార్పొరేటర్లు హాజరయ్యారు.
సంస్థ అధ్యక్షుడు మహేష్ కోటే ప్రస్తావికోపన్యాసం చేస్తూ.. మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందించాలన్నారు. చివరగా సామాజిక ప్రజా సేవాసమితి తరఫున రమేష్ నాంపల్లి, చిరంజీవి ఫ్యాన్స్ తరఫున అరవింద్ దోమల్ చిరంజీవిని సన్మానించారు.
గర్వంగా ఉంది!
Published Mon, Dec 30 2013 2:27 AM | Last Updated on Wed, Jul 25 2018 3:13 PM
Advertisement