sushil kumae shinde
-
కులం లెక్కలు.. గెలుపు చిక్కులు
‘నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి. అవి మెత్తవి, కొత్తవి, కాలుకు హత్తుకుపోయేవి..’ ఒకప్పుడు ఉర్రూతలూగించిన పాట ఇది. మహారాష్ట్రలో షోలాపూర్ ఒకప్పుడు చెప్పులకు అంత ప్రసిద్ధి. మరి ఈ ఎన్నికల్లో ఎవరైనా గెలవాలంటే చెప్పులు అరిగేలా నియోజకవర్గంలో తిరగవలసిందే. అంతటి హోరాహోరీ పోరు నెలకొంది. షోలాపూర్ పశ్చిమ మహారాష్ట్రలో ఉంది. పూర్తిగా కరువు ప్రాంతం. చద్దర్స్, మిల్స్, పవర్ లూమ్స్ స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎటు చూసినా సమస్యలే. బీడీ కార్మికుల్ని కూడా సమస్యలు వేధిస్తున్నాయి. త్రిముఖ పోటీ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా కూడా పని చేసిన సుశీల్ కుమార్ షిండే షోలాపూర్‌పై పట్టున్న నాయకుడు. గత ఎన్నికల్లో మోదీ హవాతో ఆయన ఓటమి పాలైనప్పటికీ ఈసారి షిండే గెలుస్తారని కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. గతంలో మూడుసార్లు గెలుపొందిన రికార్డు ఆయనకు ఉంది. అయితే హఠాత్తుగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ మనవడు, వంచిత్ బహుజన్ అగాధి అధినేత ప్రకాశ్ అంబేడ్కర్ బరిలోకి దిగడంతో పోరు హోరాహోరీగా మారింది. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శరద్ బన్సోడ్ లక్షన్నర ఓట్ల తేడాతో షిండేపై విజయం సాధించారు. సిట్టింగ్ ఎంపీపై నియోజకవర్గం ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి కారణంగా బీజేపీ ఈసారి అభ్యర్థిని మార్చేసి ఆ«ధ్యాత్మికవేత్త సిద్ధేశ్వర్ స్వామిని బరిలోకి దింపింది. షిండే గెలుపులో దళిత, ముస్లిం ఓట్లే కీలకంగా ఉండేవి. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. షిండే, అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్, సిద్ధేశ్వర్స్వామి పోటీతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. కుల సమీకరణలు ఎవరి కొంప ముంచుతాయి? కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గంలో తెలుగు జనాభా కూడా ఎక్కువే. మొదటి నుంచీ కర్ణాటకు చెందిన లింగాయత్ ఓటర్ల ప్రాబల్యం ఎక్కువ. అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అక్కల్కోట్ తాలూకా గౌడ్గావ్ మథ్కి చెందిన లింగాయత్ ఆధ్యాత్మికవేత్త జై సిద్ధేశ్వర్ శివాచార్య మహాస్వామీజీని బరిలోకి దింపింది. ముస్లింలు, దళితులు, ఇతర ఓబీసీ జనాభా మిశ్రమంగా ఉన్న నియోజకవర్గం ఇది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీకే పట్టున్న నియోజకవర్గం. 2009లో ఇది ఎస్సీ సీటుగా రిజర్వ్ అయింది. ఆ ఎన్నికల్లో షిండే విజయం సాధించి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఈ స్థానం ఎస్సీలకు రిజర్వుడు కాకముందు కూడా ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచిన చరిత్ర షిండేది. ‘ఈసారి ముగ్గురు అభ్యర్థుల మధ్య గట్టి పోటీయే నెలకొంది. ఓట్లు చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేమంతా ఈసారి ప్రకాశ్ అంబేడ్కర్‌కే వేద్దామని అనుకుంటున్నాం’ అని ప్రశాంత్ గైక్వాడ్ అనే 22 ఏళ్ల దళిత యువకుడు చెప్పాడు. దళితులు ఎక్కువగా ఉండే బుధ్వారా పేట్లోనూ ఎక్కువ మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశ్ అంబేడ్కర్ నామినేషన్ సమయంలో ఆయన ఒంటరిగానే వచ్చారు. కానీ కాసేపటికే ఆ వీధి వీధంతా జనమే. అదే ఆయనకున్న జనాదరణను చాటుతోందని సూరజ్ సర్వేద్ అనే స్థానికుడు అంటున్నారు. అంబేడ్కర్ పార్టీతో అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం జత కట్టింది. దీంతో ముస్లింలు కూడా ఈ పార్టీకి వేసే అవకాశాలున్నాయి. ‘నా ఓటు కాంగ్రెస్‌కే. కానీ చాలామంది అంబేడ్కర్ మనవడిపైపే మొగ్గు చూపిస్తున్నారు. ఈ త్రిముఖ పోటీలో ఓట్లు చీలిపోయి బీజేపీ లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి’ అని జావేద్ షేక్ అనే స్థిరాస్తి వ్యాపారి అభిప్రాయపడ్డారు. -
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ పరిశీలకులు వీరే..
న్యూఢిల్లీ : రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండేలను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల పరిశీలకులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం నియమించారు. వీరిద్దరికీ ఆయా రాష్ట్రాల్లో సీఎల్పీ నాయకులను ఎన్నుకునే బాధ్యతను అప్పగించారు. నాయకులను ఎన్నుకోవడంతో అశోక్ గెహ్లాట్‌కు గుజరాత్లో కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర సింగ్, సుశీల్ కుమార్ షిండేకు హిమాచల్ ప్రదేశ్‌లో మహారాష్ట్ర మాజీ మంత్రి బాలా సాహెబ్ తోరాట్ తోడ్పాటునందిస్తారు. ఇటీవల ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. మేఘాలయాలో త్వరలో ఎన్నికలు జరుగనుండటంతో ఆ రాష్ట్ర బాధ్యతలను మహారాష్ట్ర ఎమ్మెల్యే యాషోమతి ఠాకూర్‌కు అప్పగించారు. అనిల్ థామస్, నెట్టా డిసౌజా, సుసాంతో బోర్గోయిన్‌అను డివిజనల్ కో-ఆర్డినేటర్లుగా నియమించారు. వీరు ఎన్నికలకు సంబంధించిన అంశాలలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సీపీ జోషి, సెక్రటరీ విజయ లక్ష్మీ సాదోలకు సహకరిస్తారు. -
గర్వంగా ఉంది!
షోలాపూర్, న్యూస్‌లైన్: ‘విద్య అందరికీ అందుబాటులోకి రావాలనే సంకల్పంతో పూర్వీకులు స్థాపించిన పద్మశాలి శిక్షణ సంస్థ నేడు మహా వృక్షంగా ఎదిగి, 22 శాఖలుగా విస్తరించింది. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యనందిస్తున్న సంస్థ నేడు శతాబ్ధి ఉత్సవాలను జరుపుకోవడం, పూర్వీకుల కలలను సాకారం చేయడం, ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలవడం గర్వకారణంగా ఉంద’నికేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని మల్లయ్య కొండా క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన పద్మశాలి శిక్షణ సంస్థ శతాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకలకు షిండేఅధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పొట్ట చేతపట్టుకొని తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల నుంచి ఇక్కడికి వలస వచ్చి, శాశ్వతంగా స్థిరపడి అన్ని రంగాలలో రాణిస్తున్న తెలుగువారి ధైర్యసాహసాలు ప్రశంసనీయమ’న్నారు. శాసనకర్తలుగా రాణించిన గంగాధర్ కుచన్, ధర్మన్న సాదుల్, విలాస్‌రావు బేత్, వెంకప్ప మడుర్, నర్సయ్య ఆడంలను పేరుపేరునా ప్రశంసించారు. తెలుగువారి ఐక్యతకు నిదర్శనం: చిరంజీవి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పర్యాటకశాఖమంత్రి చిరంజీవి మాట్లాడుతూ.. తెలుగువారు ఇక్కడికి వలస వచ్చి శాశ్వతంగా స్థిరపడి అన్ని రంగాలలో రాణించడం హర్షించాల్సిన విషయంగా పేర్కొన్నారు. కలసికట్టుగా ఉంటూ విద్యాసంస్థను స్థాపించి, వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే సామాన్య విషయం కాదన్నారు. తెలుగువారి ఐక్యత ఈ వేడుకలు నిదర్శనమన్నారు. రాజకీయాలలోకి రాకముందు నుంచి సుశీల్‌కుమార్ షిండేతో ఉన్న సాన్నిహిత్యాన్ని వివరించారు. షోలాపూర్, తుల్జాపూర్, అక్కల్కోట్, పండరీపూర్‌లను కలిపే మెగాసర్క్యూట్ టూరిజం కోసం రూ.43 కోట్లు విడుదల చేశానని చిరంజీవి ఈ సందర్భంగా చెప్పారు. నేతన్నలంటే తనకు ప్రత్యేక అభిమానమన్నారు. చంటబ్బాయి సినిమాలో తాను వేసిన చార్లి చాప్లిన్ వేషానికి నిలువెత్తు చేనేత చిత్రపటం ఇక్కడి వారే వేసి తనకు అందజేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇక్కడి మరమగ్గాలు, బీడీ కార్మకులకు సంబంధించిన సమస్యలన్నీ యూపీఏ ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జాల్నా ఎమ్మెల్యే కైలాస్ గోరంట్యాల్, ఎమ్మెల్యే ప్రణతి షిండే, ఎమ్మెల్యే విజయ్ దేశ్‌ముఖ్, ఎమ్మెల్యే, దిలీప్ మానే, మేయర్ అల్కా రాథోడ్ , కాంగ్రెస్ నాయకురాలు ఉజ్వల షిండే, పద్మశాలి సమాజానికి చెందిన వారితోపాటు ఇతర కార్పొరేటర్లు హాజరయ్యారు. సంస్థ అధ్యక్షుడు మహేష్ కోటే ప్రస్తావికోపన్యాసం చేస్తూ.. మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనందించాలన్నారు. చివరగా సామాజిక ప్రజా సేవాసమితి తరఫున రమేష్ నాంపల్లి, చిరంజీవి ఫ్యాన్స్ తరఫున అరవింద్ దోమల్ చిరంజీవిని సన్మానించారు. -
జీఓఎంలో 10 మంది : చిదంబరం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం)లో 10 మంది ఉండనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం దీనికి నేతృత్వం వహిస్తారని సమాచారం. కేంద్ర హోం, న్యాయ, జల వనరులు, మానవ వనరుల అభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఉపరిత రవాణా-హైవేలు, విద్యుత్, సిబ్బంది శాఖల మంత్రులతో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా కూడా జీఓఎంలో ఉంటారు. ఇది ఆరు వారాల్లోగా తన సిఫార్సులను కేంద్రానికి అందజేస్తుందని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే శుక్రవారం ప్రకటించారు. బహుశా శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముందన్నారు. తెలంగాణ, విభజన అనంతరం మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల నిర్ణయం, లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలు, న్యాయ, చట్ట, శాసన సంస్థలు, పాలనా విభాగాలతో పాటు నదీ జలాలు, హైదరాబాద్ తదితర అన్ని అంశాలనూ జీఓఎం పరిశీలిస్తుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఏర్పాటయ్యే క్రమంలో అవసరమయ్యే న్యాయ, ఆర్థిక, పాలనాపరమైన అంశాలను కూడా పరిశీలిస్తుంది. ఇక నదీజలాలు, సాగునీటి వనరులు, బొగ్గు, చమురు, సహజవాయువు వంటి ఇతర ప్రాకృతిక వనరుల పంపకంపైనా దృష్టి పెడుతుంది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే అంశాన్ని కూడా చేపడుతుంది. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తి, అప్పులతో పాటు విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరాల్లో వాటాలపై కూడా దృష్టి సారిస్తుంది. దాంతోపాటు 371డి అధికరణం కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా దఖలు పడిన సదుపాయాలను కూడా విభజన పరిణామాల నేపథ్యంలో పరిశీలిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి ముందు కోస్తాంధ్రలో భాగంగా ఉన్న ఖమ్మం జిల్లా భద్రాచలాన్ని తిరిగి అటువైపే కలపాలంటూ వస్తున్న డిమాండ్లు తదితరాలనూ పరిశీలిస్తుంది. మరోవైపు డ్రాఫ్ట్ బిల్లు రూపకల్పనకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు కొంతకాలం క్రితమే మొదలైనట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. డ్రాఫ్టు చాలావరకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగానే రూపొందుతుందని అవి వివరించాయి. విభజన ప్రక్రియ వేగం చూస్తే ఇదంతా కేవలం రాజకీయ అనివార్యతలు, స్వప్రయోజనాల కోసం చేస్తున్నదే తప్ప లోతైన అధ్యయనంతో జరుగుతున్నది కాదని తేలిగ్గానే అర్థమవుతోందన్న వ్యాఖ్యలు సర్వత్రా విన్పిస్తున్నాయి!