ప్రకాశ్ అంబేడ్కర్,సుశీల్ కుమార్ షిండే, సిద్ధేశ్వర్ స్వామి
‘నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి. అవి మెత్తవి, కొత్తవి, కాలుకు హత్తుకుపోయేవి..’ ఒకప్పుడు ఉర్రూతలూగించిన పాట ఇది. మహారాష్ట్రలో షోలాపూర్ ఒకప్పుడు చెప్పులకు అంత ప్రసిద్ధి. మరి ఈ ఎన్నికల్లో ఎవరైనా గెలవాలంటే చెప్పులు అరిగేలా నియోజకవర్గంలో తిరగవలసిందే. అంతటి హోరాహోరీ పోరు నెలకొంది. షోలాపూర్ పశ్చిమ మహారాష్ట్రలో ఉంది. పూర్తిగా కరువు ప్రాంతం. చద్దర్స్, మిల్స్, పవర్ లూమ్స్ స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎటు చూసినా సమస్యలే. బీడీ కార్మికుల్ని కూడా సమస్యలు వేధిస్తున్నాయి.
త్రిముఖ పోటీ
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా కూడా పని చేసిన సుశీల్ కుమార్ షిండే షోలాపూర్‌పై పట్టున్న నాయకుడు. గత ఎన్నికల్లో మోదీ హవాతో ఆయన ఓటమి పాలైనప్పటికీ ఈసారి షిండే గెలుస్తారని కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. గతంలో మూడుసార్లు గెలుపొందిన రికార్డు ఆయనకు ఉంది. అయితే హఠాత్తుగా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ మనవడు, వంచిత్ బహుజన్ అగాధి అధినేత ప్రకాశ్ అంబేడ్కర్ బరిలోకి దిగడంతో పోరు హోరాహోరీగా మారింది. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శరద్ బన్సోడ్ లక్షన్నర ఓట్ల తేడాతో షిండేపై విజయం సాధించారు. సిట్టింగ్ ఎంపీపై నియోజకవర్గం ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి కారణంగా బీజేపీ ఈసారి అభ్యర్థిని మార్చేసి ఆ«ధ్యాత్మికవేత్త సిద్ధేశ్వర్ స్వామిని బరిలోకి దింపింది. షిండే గెలుపులో దళిత, ముస్లిం ఓట్లే కీలకంగా ఉండేవి. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. షిండే, అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్, సిద్ధేశ్వర్‌స్వామి పోటీతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది.
కుల సమీకరణలు ఎవరి కొంప ముంచుతాయి?
కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గంలో తెలుగు జనాభా కూడా ఎక్కువే. మొదటి నుంచీ కర్ణాటకు చెందిన లింగాయత్ ఓటర్ల ప్రాబల్యం ఎక్కువ. అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి అక్కల్‌కోట్ తాలూకా గౌడ్‌గావ్ మథ్‌కి చెందిన లింగాయత్ ఆధ్యాత్మికవేత్త జై సిద్ధేశ్వర్ శివాచార్య మహాస్వామీజీని బరిలోకి దింపింది. ముస్లింలు, దళితులు, ఇతర ఓబీసీ జనాభా మిశ్రమంగా ఉన్న నియోజకవర్గం ఇది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీకే పట్టున్న నియోజకవర్గం. 2009లో ఇది ఎస్సీ సీటుగా రిజర్వ్ అయింది. ఆ ఎన్నికల్లో షిండే విజయం సాధించి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఈ స్థానం ఎస్సీలకు రిజర్వుడు కాకముందు కూడా ఇక్కడి నుంచి రెండుసార్లు గెలిచిన చరిత్ర షిండేది. ‘ఈసారి ముగ్గురు అభ్యర్థుల మధ్య గట్టి పోటీయే నెలకొంది. ఓట్లు చీలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మేమంతా ఈసారి ప్రకాశ్ అంబేడ్కర్‌కే వేద్దామని అనుకుంటున్నాం’ అని ప్రశాంత్ గైక్వాడ్ అనే 22 ఏళ్ల దళిత యువకుడు చెప్పాడు. దళితులు ఎక్కువగా ఉండే బుధ్వారా పేట్‌లోనూ ఎక్కువ మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశ్ అంబేడ్కర్ నామినేషన్ సమయంలో ఆయన ఒంటరిగానే వచ్చారు. కానీ కాసేపటికే ఆ వీధి వీధంతా జనమే. అదే ఆయనకున్న జనాదరణను చాటుతోందని సూరజ్ సర్వేద్ అనే స్థానికుడు అంటున్నారు. అంబేడ్కర్ పార్టీతో అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం జత కట్టింది. దీంతో ముస్లింలు కూడా ఈ పార్టీకి వేసే అవకాశాలున్నాయి. ‘నా ఓటు కాంగ్రెస్‌కే. కానీ చాలామంది అంబేడ్కర్ మనవడిపైపే మొగ్గు చూపిస్తున్నారు. ఈ త్రిముఖ పోటీలో ఓట్లు చీలిపోయి బీజేపీ లాభపడే అవకాశాలు కనిపిస్తున్నాయి’ అని జావేద్ షేక్ అనే స్థిరాస్తి వ్యాపారి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment