
పెళ్లికి.. రూ. 10 కోట్లు
⇒ టీడీపీ ఎమ్మెల్యేల ఆర్భాటం
⇒ సెట్టింగులు, భోజనాలకే రూ.4.50 కోట్ల ఖర్చు
సాక్షి, గుంటూరు: ఇద్దరూ అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలే. ఇంకేముందీ తమ పిల్లల పెళ్లిని అత్యంత ఆడంబరంగా, కళ్లు మిరు మిట్లు గొలిపే సెట్టింగుల మధ్య వైభవో పేతంగా నిర్వహించారు. ఈ వివాహానికి సుమారు రూ.10 కోట్ల వరకు ఖర్చయి ఉంటుందని అంచనా. వినుకొండ ఎమ్మెల్యే, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు కుమార్తె లక్ష్మీసౌజన్య, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కుమారుడు కొమ్మాలపాటి సాయిసుధాకర్‌ల వివాహం మేడికొండూరు మండలంలోని కైలాసగిరి వద్ద బుధవారం జరిగింది. ఈ వివాహానికి ఇద్దరు ఎమ్మెల్యేలు కలసి అట్టహాసంగా ఏర్పా ట్లు చేశారు.
సెట్టింగులు, లైటింగ్ మొదలు కొని, భోజనాల వరకు డబ్బులు భారీయెత్తున ఖర్చు చేశారు. ముఖ్యంగా వీవీఐపీ, వీఐపీ, సాధారణ.. ఇలా మూడు కేటగిరీలు గా పెట్టిన భోజనాలకే రూ.2 కోట్లు ఖర్చయి నట్లు తెలుగుదేశం వర్గాలు వెల్లడించాయి. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వివాహానికి సెట్టింగ్‌లు వేసిన బెంగళూరుకు చెందిన ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీతో భారీ సెట్టింగ్‌లు వేయించారు. ఎమ్మెల్యే శ్రీధర్‌కు చెందిన అభినందన వెంచర్స్‌లో ఈ వివాహం జరిగింది. ఇందుకోసం 30 ఎకరాల విస్తీర్ణంలో సెట్టింగ్ నిర్మించారు. ఒకటిన్నర ఎకరం విస్తీర్ణంలో వివాహ మండపాన్ని ఏర్పాటు చేశారు. వీటి కోసం రూ.2.50 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
వినుకొండ డిపో నుంచి ఆర్టీసీ బస్సులు, జిల్లాలోని పలు ప్రైవేటు ట్రావెల్స్, బస్సులు, కార్లు అన్నీ కలిపి రవాణాకు రూ.42 లక్షలు చెల్లించారు. ఇవికాకుండా సిబ్బంది, ఇతర కూలి ఖర్చుల నిమిత్తం రూ.కోటి ఖర్చు పెట్టారు. వీటితోపాటు, లైటింగ్, ఇతర ఏర్పాట్లకు, వివాహానికి పెద్దయెత్తున తరలివచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, ఇతర అతిథుల కోసం చేసిన ఏర్పాట్లకు రూ.కోట్లలో ఖర్చయినట్లు టీడీపీ వర్గాల సమాచారం. ఈ సందర్భంగా సుమారు 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు ఈ వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.