రూ.417 కోట్లు తినేశారు!
Published Sun, Sep 29 2013 12:52 AM | Last Updated on Fri, Sep 1 2017 11:08 PM
సాక్షి, చెన్నై:చెన్నై మహానగర కార్పొరేషన్ పాలక మండలి సమావేశం శనివారం ఉదయం రిప్పన్ బిల్డింగ్‌లో జరిగింది. మేయర్ సైదై దురైస్వామి, డెప్యూటీ మేయర్ బెంజిమిన్, కమిషనర్ విక్రమ్ కపూర్ తదితరులు హాజరయ్యూరు. ప్రశ్నోత్తరాల అనంతరం మేయర్ ప్రత్యేక ప్రకటన చేశారు. డీఎంకే హయూంలో రోడ్ల పేరుతో రూ.417 కోట్లు తినేశారని ఆరోపించడం వివాదానికి దారి తీసింది. డీఎంకే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా మేయర్ పట్టించుకోకుండా తన ప్రకటనను చదివారు. రోడ్లు వేసినట్లు డీఎంకే చూపిందని, అయితే అవి ఎక్కడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. దీనిపై పూర్తిస్థాయి పరిశీలన జరుగుతోందని వెల్లడించారు. ఇంతలో డీఎంకే సభ్యులు బోస్ తదితరులు జోక్యం చేసుకున్నారు.
ఈ అవినీతిపై రిటైర్డ్ జడ్జితో విచారణకు సిద్ధమా అని మేయర్‌ను ప్రశ్నించారు. ఈ క్రమంలో డీఎంకే, అన్నాడీఎంకే సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రిటైర్డ్ జడ్జితో కాదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించిందుకు తాము సిద్ధమని, ఇందుకు మీరు సిద్ధమేనా అని ప్రశ్నించారు. వాగ్వాదం ముదరడంతో సభను వాకౌట్ చేస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. విచారణను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేని వాళ్లందరూ తమకు సవాళ్లు విసురుతున్నారంటూ మేయర్ ధ్వజమెత్తారు.
రూ.1200 కోట్లతో పనులు
చివరగా సమావేశంలో 72 తీర్మానాలకు ఆమోదముద్ర వేశారు. రూ.1200 కోట్లతో 10,118 రోడ్లను పునరుద్ధరించేందుకు నిర్ణయించారు. ఐదేళ్ల కాలంలో రోడ్ల అభివృద్ధికి డీఎంకే రూ.600 కోట్లు మాత్రమే కేటాయించిందని, ఇందులో రూ.417 కోట్లు మింగేసిందని మేయర్ ఆరోపించారు. తాను మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నగర పరిధిలోని 30,560 రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టానని వివరించారు. ఇప్పటి వరకు రూ.1150 కోట్లతో 8146 రోడ్లను పునరుద్ధరించామని పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.1200 కోట్లతో 10,118 రోడ్లను పునరుద్ధరించనున్నామని ప్రకటించారు. నగరంలో నిబంధలనకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై కొరడా ఝుళిపించనున్నామని స్పష్టం చేశారు. రెండు వందలకుపైగా భవనాలకు నోటీసులు జారీ చేశామని, వివరణ వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Advertisement
Advertisement