
బెంగళూరులో పట్టపగలే దారుణం!
బెంగళూరు (బనశంకరి): నగరంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. శివాజీనగరలోని కమర్షియల్‌స్ట్రీట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు... శివాజీ నగరలోని మిల్క్‌మన్‌వీధిలో నివాసముంటున్న రుద్రేశ్ (35) ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే రుద్రేశ్ ఆదివారం ఉదయం ఇక్కడి ఆర్‌బీఏఎన్‌ఎంఎస్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్వయంసేవక్ సంఘ్ కవాతులో పాల్గొని మధ్యాహ్నం 1 గంటల సమయంలో బైక్‌లో ఇంటికి బయలుదేరాడు. మార్గం మధ్యలో కామరాజ రోడ్డులో వస్తుండగా బైక్‌పై వచ్చిన నలుగురు వ్యక్తులు రుద్రేశ్ వాహనాన్ని అడ్డుకుని మారణాయుధాలతో దాడి చేసి హత్య చేసి పారిపోయారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కమర్షియల్ స్ట్రీట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి మృతదేహాన్ని బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. దుండగుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పాతకక్షల నేపథ్యంలో రుద్రేశ్ హత్యకు గురై ఉండొచ్చనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. రుద్రేశ్ హత్యకు రాష్ట్రీయ స్వయంసేవక్‌సంఘ్‌కు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తె లిపారు. మృతుడు రియల్‌ఎస్టేట్ వ్యాపారంతో పాటు వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఘటన స్థలాన్ని పరిశీలించిన బీజేపీ నేతలు
కామరాజ రోడ్డులో దారుణహత్యకు గురైన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రుద్రేశ్ ఘటనా స్థలాన్ని మాజీ డిప్యూటీ సీఎం ఆర్.అశోక్, ఎంపీలు పీసీ.మోహన్, ప్రతాప్‌సింహా తదితరులు పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆర్.అశోక్ మాట్లాడుతూ... ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రుద్రేశ్ హత్య వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. మృతుడు శివాజీనగర నియోజకవర్గ బీజేపీ కార్యదర్శిగా, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నారని ఇతను ఫైనాన్స్, రియల్‌ఎస్టేట్, పాలవ్యాపారం నిర్వహిస్తున్నారని తెలిపారు. రుద్రేశ్‌కు ఎవరితోను గొడవలు లేవని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అనే కారణంతోనే హత్యకు పాల్పడ్డారని అశోక్ ఆరోపించారు. రుద్రేశ్ శివాజీనగర నియోజకవర్గ బీజేపీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇంతవరకు శివాజీనగరలోని కామరాజరోడ్డు శివాజీ సర్కిల్‌లో గణేష ఉత్సవాలు జరగలేదు. అయితే ఈ ఏడాది వినాయక ప్రతిష్ట నిర్వహించి భారీగా బ్యానర్లు ఏర్పాటు చేశాడు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ధర్నా..
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రుద్రేశ్ హత్యకు కారకులైన నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ కార్యదర్శి శ్రీధర్, మైసూరు ఎంపీ ప్రతాప్‌సింహ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ కఠినచర్యలు తీసుకోవాలంటూ సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. రుద్రేశ్ మృతదేహానికి శవపరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద గట్టి పోలీస్ భద్రత కల్పించారు. ఆసుపత్రి వద్ద పశ్చిమవిభాగ అదనపు పోలీస్‌కమిషనర్ చరణ్‌రెడ్డి, ఆగ్నేయవిభాగం డీసీపీ హరిశేఖరన్ తదితరులు సందర్శించి అక్కడ పరిస్థితులను సమీక్షించారు. సోమవారం రుద్రేశ్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మృతుడి కుటుంబవర్గాలు తెలిపాయి.