ఓ విద్యార్థిని బస్టాపు వద్ద బస్ కోసం వేచి చూస్తోంది. ఇంతలో కొందరు పోకిరీలు ఆమెను వేధించసాగారు. బాధితురాలు సేఫ్టీ ఐల్యాండ్‌లోని బటన్ నొక్కగానే నిమిషాల్లోనే పోలీసులు వచ్చి ఆకతాయిలను పట్టుకున్నారు. త్వరలో ఇలాంటి వ్యవస్థ ఐటీ సిటీలో మహిళల భద్రతకు ఉపయోగపడనుంది.
బనశంకరి: మహిళలకు ఆపద ఎదురైనప్పుడు తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వడానికి కొత్త వ్యవస్థ ఉద్యాననగరిలో రాబోతోంది. కేవలం ఒక టచ్ ద్వారా పోలీసులకు సమాచారం అందించే ‘సేఫ్టీ ఐల్యాండ్’లను నగరంలో అమర్చనున్నారు. దేశంలో మెట్రో నగరాల్లోనే మొదటిసారిగా బెంగళూరులో ఈ ఐల్యాండ్‌లను ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో ఐల్యాండ్‌ను అమరుస్తారు. కేంద్ర ప్రభుత్వ నిర్భయ నిధి కింద 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40 శాతం నిధులతో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తారు.
ఎలా పనిచేస్తుందంటే
♦ ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో జీపీఎస్ ఆధారిత టచ్, ట్యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించే ఎలక్ట్రానిక్ పరికరాలను అమర్చుతారు.
♦ మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు, అధికంగా ఉన్న కాలేజీలతో పాటు విద్యా సంస్థలు, గార్మెంట్స్, ఐటీ బీటీ కంపెనీలు, ప్రైవేటు కంపెనీల వద్ద ఐల్యాండ్‌ను ఏర్పాటు చేస్తారు.
♦ దీనిని పోలీస్ ప్రధాన కంట్రోల్ రూంతో అనుసంధానిస్తారు. మహిళలపై దాడులతో పాటు ఎలాంటి నేర కార్యకలాపాలు జరుగుతున్నా బాధితులు, ప్రజలు ఐల్యాండ్‌పై తడితే కంట్రోల్ రూంలో సిగ్నల్ మోగుతుంది. పోలీసులు 2 నుంచి 5 నిమిషాల్లోగా ఘటనాస్ధలానికి చేరుకుంటారు.
♦ పింక్, హోయ్సళతో పాటు గస్తీ వాహనాలను ఈ వ్యవస్థకు కేటాయిస్తారు.
♦ ఎలక్ట్రానిక్ పరికరాన్ని పోకిరీలు దుర్వినియోగం చేయకుండా అక్కడ నాణ్యమైన సీసీ కెమెరాలను బిగిస్తారు.
నగర పోలీసుల పథకమే
నగరంలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో కూడా అధిక సంఖ్యలో సీసీ కెమెరాలను అమర్చి నేర కార్యకలాపాలపై ప్రత్యే నిఘా ఉంచనున్నట్లు అదనపు పోలీస్‌కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. ఎన్నోసార్లు ప్రజల వద్ద మొబైల్, ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు, అలాంటి వారికి ఐల్యాండ్‌ట్యాప్ పరికరం ఎంతో అనుకూలం కానుంది. ఐటీ సిటీలో మహిళల భద్రతకు కోసం ఐల్యాండ్ పథకాన్ని బెంగళూరు పోలీసులు రూపొందించగా, కేంద్రప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపిందని సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. బెంగళూరులో ఫలితాలను బట్టి ఇతర నగరాల్లోనూ అమలు చేసే అవకాశముంది.
ఆ ఎమ్మెల్సీ జీతం పేదలకే
బొమ్మనహళ్లి: ఎమ్మెల్సీలలో తాను అత్యంత శ్రీమంతుడిని అని, అందువల్ల తనకు వచ్చే నెలజీతంతో పాటు ఇతర భత్యాలను అనాథలకు, క్యాన్సర్ రోగులకు అందజేస్తామని జేడీఎస్ ఎమ్మెల్సీ బీఎం ఫారూక్ చెప్పారు. మంగళూరు ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త అయిన ఫారూక్ ఆస్తులు వందల కోట్లలో ఉన్నాయి. ఎమ్మెల్సీగా నెలకు రూ. 1 లక్ష వేతనం, ఇతర ఖర్చుల కింద మరో రూ.లక్ష వస్తుందని చెప్పారు. ఆ నగదును అనాథలకు, క్యాన్సర్ రోగులకు అందజేస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment