కదం తొక్కిన కరుణ సేన | Salem Collecterate at karuna sena | Sakshi
Sakshi News home page

కదం తొక్కిన కరుణ సేన

Published Sat, May 30 2015 3:16 AM | Last Updated on Fri, Sep 28 2018 7:30 PM

కదం తొక్కిన కరుణ సేన - Sakshi

కదం తొక్కిన కరుణ సేన

సేలం : సేలం కలెక్టరేట్ వద్ద డీఎంకే సేనలు కదంతొక్కారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు అధికార పక్షం దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పక్షాలతో మర్యాదగా వ్యవహరించకుంటే, ప్రతి దాడులకు తామూ సిద్ధమని హెచ్చరించారు. బుధవారం జరిగిన సేలం కార్పొరేషన్ పాలక మండలి సమావేశంలో రగడ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. డీఎంకే సభ్యుడు దైవలింగంను అన్నాడీఎంకే సభ్యులు చితక్కొట్టారు. అడ్డుకునే యత్నం చేసిన  ఇతర సభ్యులపై సైతం తమ ప్రతాపం చూపించారు. ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు వర్గాల ఫిర్యాదుతో పోలీసులు కేసుల నమోదు చేశారు.

అయితే డీఎంకే వర్గాలపైన అత్యధిక సెక్షన్లు నమోదు కావడం వివాదాన్ని రేపింది. అలాగే తమ కౌన్సిలర్‌పై దాడిని నిరసిస్తూ పదో వార్డు ప్రజలు సైతం తమ ఇళ్లపై నల్ల జెండాల నిరసన కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దాడులకు నిరసనగా సేలం జిల్లా పార్టీ నేతృత్వంలో భారీ నిరసనను శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించారు.
 
కదం తొక్కిన సేన
సేలం సెంట్రల్ జిల్లా ఇన్‌చార్జ్ రాజేంద్రన్ నేతృత్వంలో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో డీఎంకే వర్గాలు, పదో వార్డు ప్రజలు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ పరిసరాలు ఇసుక వేస్తే రాలనంతగా జనంతో నిండింది. అధికార పక్షం సభ్యుల తీరుపై ఈ నిరసనలో డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. దాడులు పునరావృతం అవుతూ వస్తున్నాయని, ఇకనైనా పద్ధతి మార్చుకోకుంటే, ప్రతి దాడులకు దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ మీద దాడి చేసిన వాళ్లను వదలి పెట్టి, తమ మీదే పోలీసులు కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.

పోలీసులు అధికార పక్షం తొత్తులుగా వ్యవహరిస్తున్నారని శివాలెత్తారు. దైవలింగంను హతమార్చేంత ఆగ్రహంతో అధికార పక్షం సభ్యులు తమ వీరంగాన్ని ప్రదర్శిస్తే, పొలీసులు వారిపై పిట్టి కేసులు నమోదు చేసి ఉండటం విచారకరంగా పేర్కొన్నారు. పోలీసులు తమ ధోరణి మార్చుకుని, అధికార పక్షం అడుగులకు మడుగులు వత్తకుండా, జరిగిన ఘటనను సమగ్రంగా విచారించి కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

సభలో ఒక సభ్యుడిపై దాడి జరుగుతుంతే,  మేయర్ సౌండప్పన్ చూస్తూ ఊరుకోవడం శోచనీయమని విమర్శించారు. దాడిని అడ్డుకోకుండా, చివరకు గాయపడ్డ సభ్యుడ్ని సభ నుంచి సస్పెండ్ చేయడం బట్టి చూస్తే, పథకం ప్రకారం అన్నాడీఎంకే వర్గాలందరూ కలిసి కట్టుగా దైవలింగంపై దాడి వ్యూహంతోనే వచ్చినట్టుగా  అనుమానం కల్గుతోందన్నారు.  అధికార పక్షం ప్రజా సమస్యలను విస్మరించిందని, అవినీతి తాండవం చేస్తున్నదని ఆరోపించారు. ప్రశ్నించే వాళ్ల నోళ్లను నొక్కడమే కాకుండా, ఏకంగా దాడులకు ఒడిగట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఈ నిరసనకు మాజీ ఎంపి సెల్వ గణపతి,  మాజీ ఎమ్మెల్యేలు వీర పాండిరాజ, శివలింగం నేతృత్వం వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement