ఆందోళనలో ఆ నలుగురు ఎంపీలు! | Madras High Court Issues Notice To Four Tamil Nadu MPs | Sakshi
Sakshi News home page

ఆందోళనలో ఆ నలుగురు ఎంపీలు!

Published Wed, Sep 18 2019 10:30 AM | Last Updated on Wed, Sep 18 2019 10:35 AM

Madras High Court Issues Notice To Four Tamil Nadu MPs - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన ఆ నలుగురు ఎంపీల గొంతులో వెలక్కాయ పడింది. మింగలేక, కక్కలేని పరిస్థితి ఏర్పడింది. ఒక పార్టీలో సభ్యత్వం...మరో పార్టీ చిహ్నంపై పోటీ...ఎంపిక చెల్లదని మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్‌తో మిత్రపక్ష ఎంపీల్లో ముసలం ఏర్పడింది. గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే  కూటమి నుంచి ఉదయసూర్యుడి చిహ్నంపై విడుదలై చిరుతై కట్చి (వీసీకే)కి చెందిన రవికుమార్, కొంగు మక్కల్‌ దేశీయ కట్చికి చెందిన చిన్నరాజ్, ఎండీఎంకేకు చెందిన గణేశమూర్తి, ఐజేకేకు చెందిన పారివేందర్‌ గెలుపొందారు.

ఇదిలా ఉండగా, డీఎంకే అధికార చిహ్నమైన ఉదయసూర్యుడి గుర్తుపై గెలుపొందిన నలుగురి గెలుపు చెల్లదని ప్రకటించాలని మక్కల్‌ శక్తి కట్చి అధ్యక్షులు ఎంఎల్‌ రవి మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  ‘ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం ఒక పార్టీకి చెందిన సభ్యుడు ఆ పార్టీ నుంచి వైదొలగకుండా మరో పార్టీ గుర్తుపై పోటీచేయచడం చట్టవిరుద్ధం. ఇందుకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు’ అని తన పిటిషన్‌ ద్వారా కోర్టుకు విన్నవించాడు. 

ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు సత్యనారాయణన్, ఎన్‌.శేషసాయిలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ముందుకు ఈ పిటిషన్‌ మంగళవారం విచారణకు వచ్చింది. పార్టీలో సభ్యత్వం లేని వ్యక్తి ఆ పార్టీ చిహ్నంపై పోటీచేయడాన్ని అనుమతించడం ఎన్నికల నిబంధనలను మోసగించడం కిందకు రాదా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఎన్నికల్లో పార్టీ పేరు, ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే పార్టీ చిహ్నామే ప్రాధాన్యంగా మారింది. చిహ్నాన్ని చూసే ప్రజలు ఓటేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపోటముల కంటే నిజాయితీగా పోటీచేయడమే ముఖ్యమని న్యాయమూర్తులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో కోర్టులో ఎన్నికల కమిషన్‌ ప్రతినిధి తన వాదనను వినిపిస్తూ, ఒక పార్టీకి చెందిన వ్యక్తి మరోపార్టీ తరఫున పోటీచేయరాదనే నింబధన ఉన్నప్పటికీ ఎన్నికల అధికారి ఆ నామినేషన్‌ను ఆమోదించిన పక్షంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నికల కేసును మాత్రమే వేయాలి, ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని అన్నాడు. సుప్రీంకోర్టు తీర్పులను అనుసరించి ఎన్నికల సంస్కరణల్లో భాగంగా అనేక చట్టాలు వచ్చిన సంగతిని న్యాయమూర్తులు గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్, డీఎంకే, అన్నాడీఎంకే, ఆయా పార్టీల చిహ్నాలపై పోటీచేసి గెలుపొందిన కూటమి పార్టీల ఎంపీలు నవంబరు 12వ తేదీలోగా బదులివ్వాలని న్యాయమూర్తులు ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement