చెన్నై: అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా సరికొత్త చరిత్ర సృష్టించిన భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను అభినందిస్తూ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. కమల తమిళ మూలాలను ప్రస్తావిస్తూ.. అత్యున్నత పదవికి ఎన్నికై తమిళజాతి గర్వపడేలా చేశారంటూ ప్రశంసించారు. ద్రవిడ సంస్కృతి గొప్పదనాన్ని ప్రపంచ నలుమూలలా చాటేలా తన పదవీకాలంలో అగ్రరాజ్య ప్రతిష్ట మరింత ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. లింగ వివక్షకు తావులేని సమసమాజ స్థాపనకై కృషి చేసే ద్రవిడ ఉద్యమానికి కమలా హారిస్ విజయం మరింత ఊతమిచ్చిందని పేర్కొన్నారు. ఈ మేరకు.. ‘‘వణక్కం.... తమిళులు గర్వపడే విషయం ఇది. తమిళనాడు మూలాలు గల మహిళ యునైటెడ్ స్టేట్స్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావడం గర్వకారణం. కఠిన శ్రమ, అంకితభావంతో తమిళ మహిళ అమెరికాను పాలించగల సమర్థత కలిగి ఉందనే విషయాన్ని నిరూపించారు’’ అంటూ కమలను ఉద్దేశించి తమిళ భాషలో సోమవారం లేఖ రాశారు.(చదవండి: అమెరికా ఎన్నికలు.. అరుదైన దృశ్యం!)
కాగా అగ్రరాజ్యానికి వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి మహిళ, తొలి నల్లజాతి మహిళగా చరిత్రకెక్కిన కమలా హారిస్ 1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు శ్యామలా గోపాలన్- డొనాల్డ్ హారిస్‌లు. తమిళనాడులోని చెన్నైకి చెందిన శ్యామలా గోపాలన్ న్యూట్రిషన్, ఎండోక్రినాలాజీలో పరిశోధన కోసం అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. కమల.. తాతయ్య పీవీ గోపాలన్ భారత స్వాతంత్య్ర సమరయోధుడు. దౌత్యాధికారిగా కూడా పనిచేశారు. ఆమె అమ్మమ్మ కూడా మహిళలకు కుటుంబ నియంత్రణ హక్కు కలిగి ఉండాలనే ప్రచారంలో పాల్గొన్నారు.
ఇక చిన్నతనంలో తరచుగా చెన్నైకు వస్తుండడం వల్ల తాత ప్రభావం ఆమెపై పడింది. తల్లి పెంపకంలో స్వతంత్ర భావాలతో పెరిగిన కమలా హారిస్ న్యాయ విద్యనభ్యసించి 2003లో శాన్‌ఫ్రాన్సిస్‌కో డిస్ట్రిక్ అటార్నీగా ఎన్నికైన తొలి నల్లజాతి, దక్షిణాసియా సంతతి మహిళగా చరిత్ర సృష్టించారు. అదే విధంగా 2011-17 మధ్య కాలంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్‌గా కీలక బాధ్యతలు చేపట్టారు. డెమొక్రటిక్ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగి 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. ఆమెకు సోదరి మాయా హారిస్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment