సలామ్.. ఫ్లాగ్‌మెన్..! | salute Phlagmen | Sakshi
Sakshi News home page

సలామ్.. ఫ్లాగ్‌మెన్..!

Published Fri, Aug 16 2013 2:55 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM

salute Phlagmen


 
 సాక్షి, ముంబై: సాధారణంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయాలపై రోజూ జాతీయ జెండా ఎగురుతూ కనిపిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా జెండావిష్కరణ, అవనతానికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడటం మామూలు విషయం కాదు. వాటిని ఉదయం ఎగురవేయడం, సాయంత్రం అవనతం ఎవరు చేస్తున్నారన్న విషయాన్ని ఎవరూ అంతగా పట్టించుకోరు. కాని, అటువంటి గురుతర బాధ్యతను దశాబ్దాలుగా నిర్విరామంగా నిర్విఘ్నంగా నిర్వర్తిస్తూ అందరితో మన్ననలందుకొంటున్నారు కొందరు.. ఒక విధంగా వారి జీవితం జాతీయజెండా సేవకే అంకితమని చెప్పవచ్చు. అటువంటి వారిలో కొందరి వివరాలిలా ఉన్నాయి..
 
 అరవింద్ విచారే: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ప్రధాన కార్యాలయంపై గత 25 ఏళ్ల నుంచి అరవింద్ విచారే క్రమం తప్పకుండా జెండా ఎగరవేస్తున్నారు. 125 మెట్లు ఎక్కి ఐదో అంతస్తు టైపై సూర్యోదయం కాగానే జెండా ఎగరవేస్తారు. సూర్యాస్తమయానికి 10 నిమిషాల ముందు కచ్చితంగా అవనతం జరుపుతారు. జెండా ఎలా ఎగరవేయాలో తన తండ్రి శాంతారాం విచారే నుంచి శిక్షణ తీసుకున్నానని ఆయన అన్నారు. బీఎంసీ ప్రధాన కార్యాలయంపై 1972 నుంచి శాంతారాం విచారే జెండావిష్కరణ, అవనతం పనులు చేపట్టారు. కాని 1987లో ఆయన పదవీ విరమణ పొందడంతో ఆ బాధ్యతలు తన భుజస్కంధాలపై వేసుకున్నానని అరవింద్ గర్వంగా చెబుతున్నారు. అంటే దాదాపు 41 సంవత్సరాల నుంచి బీఎంసీ ప్రధాన కార్యాలయంపై విచారే కుటుంబమే జెండావిష్కరణ, అవనతం లాంటి పనులు చేపడుతోంది.
 
  బీఎంసీ కార్యాలయంపై జెండా ఆవిష్కరించే పనులు అరవింద్ విచారేతోపాటు జయరాం ఖండములే, రాజేంద్ర భతాణేపై కూడా ఉన్నాయి. వీరిద్దరిలో విధులకు ఎవరు వచ్చినా, రాకపోయినా అరవింద్ విచారే అడుగులు మాత్రమే ఉదయం, సాయంత్రం టైపైకి వెళతాయి. ఉదయం ఎగరవేసే సమయంలో, సాయంత్రం దింపే సమయంలో అది నేలను తాక కుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వర్షాకాలంలో జెండా తడిసిపోయి ఇనుప కొయ్యకు అతుక్కుపోతుంది. వేగంగా వీచే ఈదురుగాలులకు అది చినిగిపోయే ఆస్కారముంటుంది. ఇలాంటి సమయంలో ఎంతో సంయమనంతో, జాగ్రత్తగా కిందికి దింపాల్సి ఉంటుందని ఆయన అంటారు. గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం ఇలా రెండు పర్యాయాలు మాత్రమే జాతీయజెండాను మారుస్తారు. ఈ మధ్యకాలంలో ఒకవేళ జెండాను మార్చాల్సి వస్తే నియమ నిబంధనాల ప్రకారం పూర్తి గౌరవంతో వెంటనే కొత్తదాన్ని అమరుస్తారు. పాత జెండాను ఏం చేస్తారనేది చెప్పడం నిబంధనలకు విరుద్ధమని విచారే వెల్లడించారు.
 
 పాశ్వర్ గోసావి : 30 ఏళ్లుగా మాడా కార్యాలయం భవనంపై ఉదయం జెండా ఏర్పాటు, సాయంత్రం అవనతం చేపడుతున్నానని గోసావి అన్నారు. 2011లో పదవీ విరమణ పొందిన తర్వాత కాంట్రాక్టు బేస్‌పై ధారావి పునరాభివృద్ధి ప్రాజెక్టు పనులు చూసుకుంటున్నానని తెలిపారు. దీంతో ఇప్పటికీ స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల్లో క్రమం తప్పకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నానన్నారు. తనతోసహా తన సహచరులు 10 రోజుల ముందు నుంచి పనుల్లో నిమగ్నమవుతామన్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఈ పనులు చేపట్టడం తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని అన్నారు. ఇక ముందు కూడా కొనసాగిస్తానని గర్వంగా చెబుతున్నారు.
 
 గౌతన్ ననావరే:  కొలాబాలో ఉన్న బెస్ట్ ప్రధాన కార్యాలయం భవనంపై 27 ఏళ్ల నుంచి క్రమం తప్పకుండా జెండా ఎగరవేస్తున్నానని గౌతన్ అన్నారు. బెస్ట్ భవనంపై మే ఒకటి, ఏప్రిల్ 13, జాతీయ వారోత్సవాలు, ఆగస్టు 15, జనవరి 26, అక్టోబర్ రెండో తేదీన జెండా ఎగురవేస్తారు. ఎంతో అప్రమత్తంగా ఉండి ఈ పనులు చూసుకుంటానని అన్నారు.
 
 లక్ష్మణ్ వాఘేలా
 గత 25 ఏళ్ల నుంచి సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయంపై ప్రతీరోజు ఉదయం జెండా ఎగరవేయడం, సాయంత్రం అవనతం చేయడం తన పని అని చెప్పారు. జెండాను అవనతం చేసిన తర్వాత ఒక పద్ధతిలో మడత పెట్టి, ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ గౌరవంగా దాచి ఉంచాల్సి ఉంటుందన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement