సమన్యాయంతోనే స్వావలంబన | Samanyayantone mastered | Sakshi
Sakshi News home page

సమన్యాయంతోనే స్వావలంబన

Published Sun, Sep 14 2014 2:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

Samanyayantone mastered

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించడం ద్వారా వారి స్వావలంబనకు ప్రభుత్వం సహకరిస్తే, దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని గవర్నర్ వజూభాయ్ రుఢాభాయ్ వాలా అభిప్రాయపడ్డారు. నగరంలోని గాంధీ భవన్‌లో ఏబీవీపీ, కారుణ్య విద్య సేవా ట్రస్టు సహకారంతో ‘మహిళల రక్షణకు సవాళ్లు’ అనే అంశంపై శనివారం ఏర్పాటు చేసిన రాష్ర్ట స్థాయి సదస్సును ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ బ్రిటిషర్లను ఎదిరించి పోరాడిన ఝూన్సీ లక్ష్మీబాయ్, దివంగత ప్రధాని ఇందిరా గాంధీలను మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలని ఉద్బోధించారు. గుజరాత్‌లో గ్రామ పంచాయతీల మొదలు పార్లమెంట్ వరకు 50 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారని చెబుతూ, దీనిని ప్రతి రాష్ట్రం అనుసరిస్తే మహిళల స్వావలంబన సాధ్యపడుతుందని సూచించారు. సాధనల విషయంలో భారతీయ మహిళలకు బలం ఉన్నప్పటికీ, న్యూనతా భావం వారిని వెనక్కు నెట్టి వేస్తున్నదని చెప్పారు.

దీనిని అధిగమించి దేశ ప్రగతిలో మహిళలు కూడా చేయి చేయి కలపాలని పిలుపునిచ్చారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన భారత దేశంలో అందరూ ఒకటేననే భావనను మరిచిపోరాదని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో బలంగా ఉన్నారనేది కేవలం ప్రకటనలకే పరిమితం కారాదని తెలిపారు. నిబద్ధతతో వ్యవహరిస్తేనే ఇందులో ఫలితాలను సాధించగలుగుతామని చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఎటు చూసినా స్వార్థం తాండవిస్తోందని, దేశ సేవ అనేది మాటలకే పరిమితమవుతోందని నిష్టూరమాడారు. విద్యార్థుల్లో దేశ భక్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అందరి పట్లా వ్యతిరేక భావాన్ని పెంచుకోకూడదని ఉద్బోధించారు.
 
క్షమాభిక్షపై ప్రభుత్వంతో మాట్లాడతా...

యావజ్జీవ కారాగార శిక్షకు గురైన వారిని సత్ప్రవర్తన ఆధారంగా విడుదల చేసే విషయమై ప్రభుత్వంతో చర్చిస్తానని గవర్నర్ తెలిపారు. సదస్సు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం, రాజ్ భవన్‌ల నడుమ చర్చించాల్సిన విషయాలను బహిరంగంగా మాట్లాడేది లేదని తేల్చి చెప్పారు. మీడియా తన పనేదో చేసుకుని వెళ్లాలని అన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement