మాజీ మంత్రి అశ్లీల సీడీ కేసులో మరో ట్విస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రి సందీప్ కుమార్ సెక్స్ సీడీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. సందీప్ మొబైల్తో స్వయంగా ఈ వీడియో తీసినట్టు ఇంతకుముందు వార్తలు రాగా, ఈ సీడీలో ఉన్న మహిళ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రేషన్ కార్డు విషయం మాట్లాడేందుకు మంత్రిగా ఉన్న సందీప్ వద్దకు వెళ్ళానని, ఆ సమయంలో కూల్ డ్రింక్లో డ్రగ్స్ కలిపి ఇచ్చారని, డ్రింక్ తాగాక తాను అపస్మారకస్థితిలోకి వెళ్లానని, ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.
మహిళ చేసిన ఆరోపణలు నిజమైతే, ఈ కేసును తీవ్రంగా పరిగణించాలని, సందీప్నకు కఠినశిక్ష విధించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సందీప్ను సస్పెండ్ చేస్తున్నట్టు శనివారం ఉదయం ప్రకటించగా, సందీప్తో సీడీలో ఉన్న మహిళ ఇదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సందీప్ కుమార్ ఓ మహిళతో అభ్యంతరకర పరిస్థితుల్లో ఉన్నట్టుగా సీడీ వెలుగుచూడటంతో ఆయన మంత్రి పదవి కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా దళితుడైనందుకే తనపై కుట్రపన్ని కేసులో ఇరికించారని సందీప్ ఆరోపించిన విషయం తెలిసిందే. కాగా ఈరోజు సాయంత్రం సందీప్ కుమార్ రోహిణీలోని డీజీపీ కార్యాలయంలో లొంగిపోయారు.