సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపనున్నట్లు ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించారు. ఈనెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మొత్తం 12,624 బస్సులను ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు గురువారం ఆమె తెలిపారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:
చెన్నై సచివాలయంలో ప్రజలకు పొంగల్ పండుగ సందర్భంగా ఉచిత కానుకలను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం ఒక ప్రకటన విడుదల చేశారు. పొంగల్ పండుగను తమ స్వస్థలంలో బంధుమిత్రుల మధ్య జరుపుకోవాలని ఆశిస్తారని, ఎంతో వ్యయప్రయాసలకోర్చి దూరప్రాంతాలకు ప్రయాణిస్తారని తెలిపారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు బయలుదేరడం వల్ల రోజూవారీగా అందుబాటులో ఉండే బస్సులు చాలవని అన్నారు. అందుకే గత నాలుగేళ్లుగా పొంగల్ పండుగకు ప్రత్యేక బస్సులను నడపడం ఆనవాయితీగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ ప్రత్యేక బస్సులకు ప్రజల నుంచి ఏటా గొప్ప స్పందన వస్తోందని తెలిపారు.
ఈ ఉత్సాహంతో కోయంబేడు బస్‌స్టేషన్ నుంచి రాష్ట్రం నలుమూలలకు 12,624 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని చెప్పారు. ఈనెల 9వ తేదీ నుంచి14వ తేదీ వరకు వెళ్లేందుకు, 15 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు తిరుగు ప్రయాణం కోసం ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని తెలిపారు. అలాగే చెన్నై పరిసర ప్రాంతాలు, మహాబలిపురం వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు మరో 200 సిటీ బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. ప్రయివేటు బస్సు యాజమాన్యాలు రద్దీని అడ్డుపెట్టుకుని హెచ్చు చార్జీలు వసూలు చేయకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అధిక చార్జీలు వసూలు చేస్తే 044-24794709కు ఫిర్యాదు చేయవచ్చని ఆమె చెప్పారు.
పొంగల్ కానుకల పంపిణీ:
పొంగల్ పండుగ సందర్భంగా ప్రభుత్వం ద్వారా కానుకలు పంచే కార్యక్రమాన్ని సీఎం జయలలిత సచివాలయంలో ప్రారంభించారు. కొన్ని కుటుంబాలను తన చాంబర్‌కు పిలిపించుకుని పొంగల్ కానుకల బ్యాగును అందజేశారు. అలాగే రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో పంపిణీ ప్రారంభించారు. 1.91 కోట్ల మందికి లబ్ధి చేకూర్చే పొంగల్ కానుకల వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.318 కోట్లు అదనపు భారం పడుతోందని సీఎం తెలిపారు.
పొంగల్‌కు ప్రత్యేక బస్సులు
Published Fri, Jan 8 2016 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM
Advertisement
Advertisement